గాంధీకి 16.. ఉస్మానియాకు 21 | Medical colleges Improved in results | Sakshi
Sakshi News home page

గాంధీకి 16.. ఉస్మానియాకు 21

Published Tue, May 28 2019 1:30 AM | Last Updated on Tue, May 28 2019 1:30 AM

Medical colleges Improved in results  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ వైద్య కళాశాలలు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమకూర్చుకుంటూ అత్యుత్తమ వైద్యవిద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఏటా అనేక మంది విద్యార్థులను ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నాయి. వైద్యవిద్య బోధనలోనే కాదు.. వైద్యసేవల్లోనూ కార్పొరేట్‌కు దీటుగా ముందుకు సాగుతున్నాయి. వైద్య విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘ఇండియా టుడే’సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న 503 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలపై సర్వే నిర్వహించింది. జాతీయస్థాయి ఉత్తమ వైద్య కళాశాలల జాబితాలో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు మొదటి ర్యాంకు, సీఎంసీ వెల్లూరుకు రెండో ర్యాంకు, పుణేలోని ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ వైద్య కళాశాలకు మూడో ర్యాంకు లభించింది. నగరానికి చెందిన గాంధీ మెడికల్‌ కాలేజీకి 16వ స్థానం లభించగా, ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి 21వ ర్యాంకు దక్కింది. ఎంబీబీఎస్‌ లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఉస్మానియాలో కాకుండా గాంధీ కాలేజీలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.  

గతంలో 21.. ఇప్పుడు 16.. 
గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా గాంధీ జనరల్‌ ఆస్పత్రి కొనసాగుతోంది. 1954లో గాంధీ ఆస్పత్రి ప్రారంభమైంది. 1956లో ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎంసీఐ) గుర్తింపు లభించింది. తొలి ఓపెన్‌హార్ట్‌ సర్జరీ ఇక్కడే జరిగింది. తొలి కేథల్యాబ్‌ ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇక్కడ డీఎం కార్డియాలజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 43 విభాగాలు ఉన్నాయి. వైద్య కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రిలో ఓపీ, ఐపీ, అత్యవసర సేవలు సహా రక్తనిధి కేంద్రం కూడా ఉంది. మౌలిక సదుపాయాలు, మానవవనరులు, విద్యాబోధన, ఫలితాలు ప్రతిపాదికన ఇండియా టుడే గతంలో నిర్వ హించిన సర్వేలో 21వ స్థానంలో ఉన్న గాంధీ వైద్య కళాశాల.. ఈ ఏడాది 16వ స్థానానికి చేరుకుంది. ఉస్మానియా వైద్య కళాశాలతో పోలిస్తే ఇక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం, కాలేజీ క్యాంపస్‌లోనే అనుబంధ ఆస్పత్రి కొనసాగుతుండటం, నిపుణులైన అధ్యాపకులు అందుబాటులో ఉండటం వల్ల నీట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సైతం ఈ కాలేజీలో చదివేందుకు ఇష్టపడుతున్నారు.  

ఉస్మానియాకు 21వ స్థానం
ఉస్మానియా వైద్య కళాశాలకు 1951లో ఎంసీఐ గుర్తింపు లభించింది. ఒకప్పుడు టాప్‌ ర్యాంకర్లంతా ఈ కాలేజీలో చేరేందుకు ఎక్కువ ఇష్టపడేవారు. అనుబంధ ఆస్ప త్రులు వైద్య కళాశాలకు దూరంగా ఉండటం, ఆయా ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇటీవల ఎంసీఐ ఆదేశాల మేరకు రూ.70 కోట్లతో మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్, ఎండీఆర్‌యూ, లేడీస్‌ హాస్టల్, అధునాతన లైబ్రరీ, రెండు హాస్టల్‌ భవనాలు సహా ఇతర మౌలిక వసతులను మెరుగుపర్చుకుంది. మానవవనరులను సమకూర్చుకుంది. బోధనలోనే కాదు ఫలితాల్లోనూ మెరుగుపడింది. ఫలితంగా ఈ ఏడాది 21వ స్థానంలో నిలిచి పూర్వవైభవాన్ని సంతరించుకుంది. గతేడాది జాబితా లో కనీసం స్థానం కూడా దక్కలేదు. ఈసారి ఏకంగా 21వ స్థానం దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement