నగరం
రోజంతా ఉద్రిక్త వాతావరణం
హెచ్‌సీయూ...ఓయూల్లో విద్యార్థుల ఆందోళన
ఓయూలో పరస్పర దాడులు...గాయాలు
అట్టుడికిన హెచ్‌సీయూ
నగరంలో 40 డి గ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
ఓ వైపు మండుతున్న ఎండలు... మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఉస్మానియా విశ్వ విద్యాలయాల్లో విద్యార్థుల ఆందోళనలతో నగరం వేడెక్కింది. మంగళవారం నాటి పరిణామాల నేపథ్యం... జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్ రాకతో హెచ్‌సీయూ అట్టుడికింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ... పరిస్థితి ఎటు దారి తీస్తుందోననే టెన్షన్... కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలతో విద్యార్థులు.. ఎలాగైనా నిలువరించాలనే ఉద్దేశంతో భారీగా మోహరించిన పోలీసులు.. బుధవారం ఉదయం నుంచీ సాయంత్రం వరకూ క్షణ క్షణం భయం భయంగా గడిచింది. ఇంకోవైపు ఉస్మానియా వర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో బయట పడిన మృతదేహం అక్కడ చిచ్చు రేపింది.
అది తమ సహచరుని మృతదేహ మేనని... నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావించిన విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అక్కడికి చేరుకున్న పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. ఫలితంగా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇరువర్గాల దాడుల్లో అటు పోలీసు ఉన్నతాధికారులు... సిబ్బంది.. ఇటు విద్యార్థులు గాయపడ్డారు. ఆ మృతదేహం విద్యార్థిది కాదని పోలీసులు ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. మొత్తమ్మీద తీవ్ర ఎండలకు తోడు.. వర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలతో న‘గరం’..గరంగా మారింది.