మంత్రి పదవులు అడిగామా?
సీఎం కేసీఆర్‌కు ఓయూ విద్యార్థుల ప్రశ్న
ఉస్మానియా యూనివర్సిటీ: ‘మేమేమైనా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, మంత్రి పదవులను అడిగామా? లేక ప్రభుత్వంలో భాగస్వామ్యం కోరామా?’ అని సీఎం కేసీఆర్‌ను ఓయూ విద్యార్థులు ప్రశ్నించారు. వయోపరిమితి దాటిపోతున్నందున కేవలం ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా వేడుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా రన్‌ఫర్ జాబ్ పేరుతో సోమవారం నిరసన పరుగు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కళ్యాణ్, మానవతరాయ్, బాబులాల్‌నాయక్, వీరబాబు, జి.కిరణ్‌గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులను వాడుకొని... అధికారం చేపట్టిన కేసీఆర్ నేడు వారిని శత్రువుల్లా చూడడం తగదన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని, ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు ఈ నెల 17న అసెంబ్లీ ముట్టడి, డిసెంబర్‌లో బారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు.