మన ‘న్యాక్’ ఘనత
- జాతీయ శిక్షణ కేంద్రంగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
- ‘పీఎం కౌశల్ వికాస్ యోజన’ అభ్యర్థులకు శిక్షణ ఇక్కడే
- అభ్యర్థులను పంపేందుకు ఆసక్తి చూపుతున్న విదేశాలు
- దక్షిణాఫ్రికా, భూటాన్ బృందాలకు ట్రైనింగ్ పూర్తి
- ఈ నెలలో ఒప్పందం కుదుర్చుకోనున్న నైజీరియా
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) అరుదైన ఘనత సాధించింది. నిర్మాణ రంగానికి అవసరమైన అంశాల్లో మెరుగైన శిక్షణ ఇస్తున్న కేంద్రంగా గుర్తింపు పొందింది. ఒకేసమయంలో ఇటు జాతీయ స్థాయిలో, మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ఈ సంస్థ సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించటం ద్వారా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ పథకానికి జాతీయ స్థాయి శిక్షణా కేంద్రంగా న్యాక్ ఎంపికైంది. మరోవైపు.. హైదరాబాద్ న్యాక్‌లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్టు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుండటంతో విదేశీ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
జాతీయ స్థాయి శిక్షణ కేంద్రంగా ఎంపిక
కేంద్రం కొత్తగా ప్రారంభించిన ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ పథకానికి న్యాక్ శిక్షణ కేంద్రంగా అవతరించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఎంపికైన యువతకు హైదరాబాద్‌లోని ‘న్యాక్’లోనే శిక్షణ ఇస్తారు. గతంలో ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన’ పథకం కింద దేశవ్యాప్తంగా యువతకు శిక్షణ ఇచ్చిన సంస్థల్లో హైదరాబాద్ ‘న్యాక్’ తొలిస్థానాన్ని పొందటంతో.. కొత్త పథకానికి ఏకైక శిక్షణ సంస్థగా కేంద్రం న్యాక్‌ను ఎంపిక చేయటం విశేషం. దీనికింద ఏటా 5 వేల మంది యువతకు ఇక్క డ శిక్షణ ఇవ్వనున్నారు. దీన్ని మరింత విస్తరించి ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద న్యాక్ భారీగా ఆదాయాన్ని పొందబోతోంది. శిక్షణ పొందే ప్రతి విద్యార్థి పేరుతో కేంద్రం న్యాక్‌కు రూ.14 వేలు చెల్లించనుంది. ఐదు వేల మందికి శిక్షణ ఇస్తే ఏటా రూ.7 కోట్లు సమకూరుతాయి. న్యాక్ తరహాలో దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పనిచేసే శిక్షకుల సామర్థ్యాన్ని పెంచేందుకు హైదరాబాద్ న్యాక్‌లో శిక్షణ ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించటం విశేషం.
ఈ నెలలో నైజీరియాతో ఒప్పందం
ఇటీవలే దక్షిణాఫ్రికా యువత హైదరాబాద్ న్యాక్‌లో పొందిన శిక్షణ నాణ్యమైందిగా ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించటంతో ఇతర దేశాలు కూడా న్యాక్‌పై దృష్టి సారించాయి. ఇక్కడ శిక్షణ పొందిన 99 మంది దక్షిణాఫ్రికా యువత ఇటీవల ఆ దేశంలో ఫుట్‌బాల్ స్టేడియంల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే భూటాన్‌కు చెందిన 24 మంది ఉద్యోగులు ఇక్కడ నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందారు. నైజీరియాకు చెందిన వంద మందికి న్యాక్‌లో నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరంతా ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారే. నిర్మాణ రంగంలో వస్తున్న కొత్త పరిజ్ఞానానికి తగ్గట్టుగా వారి సామర్థ్యాలను పెంపొందించేందుకు న్యాక్‌కు పంపాలని నిర్ణయించిన నైజీరియా ప్రభుత్వం ఈ నెలాఖరున ఒప్పందం కుదుర్చుకోనుంది. మరికొన్ని దేశాలు కూడా న్యాక్‌ను సంప్రదిస్తున్నాయి.
నాణ్యతకు ఖ్యాతి
‘‘ఇక్కడ శిక్షణ పొందిన దక్షిణాఫ్రికా విద్యార్థుల పక్షాన ఆ దేశ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయటంతో వేరే దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. న్యాక్ నాణ్యత మెరుగ్గా ఉందనటానికి ఇదే నిదర్శనం’’
- భిక్షపతి, న్యాక్ డెరైక్టర్ జనరల్
మంచి ఉపాధికి బాటలు
‘‘న్యాక్‌లో శిక్షణ పొందిన యువతకు స్వయంగా క్యాంపస్ ఇంటర్వ్యూ ల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు వారిని ఎంపిక చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. వారికి మెరుగైన వేతనాలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’’
- శాంతిశ్రీ, ప్లేస్‌మెంట్ డెరైక్టర్