
స్నేహంగా ఉంటూ.. నట్టేట ముంచాడు!
రూ. 2.5 కోట్లతో కార్ మెకానిక్ పరార్
పోలీసులను ఆశ్రయించిన 61 మంది బాధితులు
హిమాయత్‌నగర్: స్థానికులతో స్నేహంగా ఉంటూ... భర్తకు తెలియకుండా భార్య వద్ద, భార్యకు తెలియకుండా భర్త వద్ద... ఇలా పలు ఇళ్లల్లో ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పు తీసుకున్నాడో వ్యక్తి. మొత్తం రూ. 2.5 కోట్లు దండుకొని పరారయ్యాడు. దీంతో సుమారు 61 మంది బాధితులు తమకు న్యాయం చేయాలని ఆసిఫ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా కార్వాన్ హరిదాసునగర్‌కు చెందిన బాధితులు కొండయ్య, సత్యనారాయణ, రంగారావు ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్‌లో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని విస్సాకోడేరు గ్రామానికి చెందిన తానుకొండ వెంకట కేదారి నగరంలోని శారదానగర్‌లో ఉంటూ కార్ఖానాలో కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇతను తాను నివాసం ఉండే చోట అందరితో స్నేహంగా ఉండేవాడు. తాను అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నానని, సాయం చేయాలని స్థానికుల నుంచి ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద రూ. లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
ఇలా సుమారు 61 మంది నుంచి మొత్తం రూ. 2.5 కోట్లు దండుకున్నాడు. ఈ విషయం తెలిసి అందరూ తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తేవడంతో చెక్కులు ఇచ్చాడు. అవి కోర్టుకు సమర్పిస్తే బౌన్స్ అయ్యాయి. ఈ విషయమై కేదారిని ప్రశ్నిద్దామంటే అందుబాటులో లేడు. దీంతో ఆందోళనకు గురైన బాధితులంతా కలిసి ఆసిఫ్‌నగర్ ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయగా.. పోలీసు లు కేదారి కోసం గాలిస్తున్నారు. నిందితుడిని పట్టుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో బాధితులు వినోద్‌కుమార్, శివ, సురేఖ, ఉదయ్, పద్మావతి, బాలచంద్రుడు, వర్మ, యుగంధర్‌రెడ్డి, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.