బోర్డింగ్ పూర్తయినా ప్రయాణికులను అనుమతించని ‘ఇండిగో’
Published Fri, Apr 15 2016 1:38 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వయా బెంగళూరు మీదుగా కొచ్చిన్ వెళ్లాల్సిన 15 మంది ప్రయాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన ఉద్యోగుల వ్యవహారశైలితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ (413) విమానం గురువారం ఉదయం 7.15 గంటలకు టేకాఫ్ తీసుకుని బయలుదేరాల్సి ఉంది. ఈ విమానంలో కొచ్చిన్ వెళ్లేందుకు కొందరు ప్రయాణికులు అరగంట ముందుగానే విమానాశ్రయం లో చెక్‌ఇన్ పూర్తి చేయించుకుని బోర్డింగ్ పాస్‌లను తీసుకున్నారు.
విమానంలోకి వెళ్లేందుకు వీరు బయలుదేరగానే అప్పటికే గేట్ మూసినట్లుగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో విమానం టేకాఫ్ తీసుకోవడంతో ప్రయాణికులంతా ఆందోళనకు దిగారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులపట్ల దురుసుగా వ్యవహరించడంతోపాటు తక్కువ ధర టికెట్‌పై వెళ్తున్నారని, గ్రామీణులంటూ వెక్కిరించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నలుగురు ప్రయాణికులు ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌లైన్స్ వర్గాలు కూడా ఫిర్యాదును పోలీసులకు అందజేసినట్లు సమాచారం.
Advertisement