2019 ఎన్నికల్లో పోటీ చేస్తా
పవన్ కల్యాణ్ ప్రకటన..
♦ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా..
♦ నెల గడవటమే నాకు కష్టంగా ఉంది
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆదివారం రాత్రి ప్రసారమైన ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఈ క్షణం నుంచే కార్యాచరణలో ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని పేర్కొన్నారు. నెల గడవడమే కష్టంగా ఉందని, తన సిబ్బందికి జీతాలు చెల్లించాలన్నా ఇబ్బందిగా ఉన్నట్లు చెప్పారు. అన్నయ్య చిరంజీవితో రాజకీయంగా మాత్రమే విభేదాలున్నాయని, కుటుంబపరంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవిని జనసేన పార్టీలోకి రమ్మని ఆహ్వానించనని అన్నారు. సినిమాల్లో నటించడం ఎప్పుడు మానేస్తానో చెప్పలేనని, ఇంకా 2-3 సినిమాల్లో నటించే అవకాశం ఉందని వెల్లడించారు.
వాళ్లెందుకు పార్టీ మారుతున్నారో తెలుసు
రాజకీయాల్లో ఉన్నవారు అధికారం కోసం పార్టీలు మారడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు పార్టీలు మారుతున్న వారు అందుకు కారణాలు ఏం చెప్పినా, వాళ్లెందుకు మారుతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు.