సభకే తప్పుడు సమాచారం
మంత్రి పీతల సుజాతపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల నమోదుపై గనులు, భూగర్భ శాఖ మంత్రి పీతల సుజాత సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్, డి.చిన్నగోవిందరెడ్డి ధ్వజమెత్తారు. శాసన మండలి మీడియా పాయింట్‌లో మంగళవారం వారు మాట్లాడుతూ.. ఇసుక తవ్వకాల్లో గతంలో జరిగిన అవకతవకలపై తీసుకున్న చర్యలేమిటని సభలో ప్రశ్న వేయగా.. రాష్ట్రంలో 2,727 కేసులు నమోదు చేసి రూ.22.39 కోట్ల మేర అపరాధ రుసుము వసూలు చేసినట్లు మంత్రి చెప్పారన్నారు.
అయితే ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో మాత్రం 32,398 కేసులు నమోదు చేసి రూ.39 కోట్ల జరిమాన విధించినట్లు లిఖితపూర్వకంగా ఇచ్చారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో నలుగురు మంత్రులు, 36 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు జడ్పీ చైర్మన్లు, ముగ్గురు ఎంపీలకు ఇసుక మాఫియాతో సంబంధం ఉందని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పత్రికలో వార్తలు వచ్చాయని, సదరు ప్రజా ప్రతినిధుల పేర్లు సభలో చెప్పాలని డిమాండ్ చేసినప్పటికీ మంత్రి నుంచి సమాధానం రాలేదన్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి వేసిన పిల్‌పై హైకోర్టు స్పందిస్తూ అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు విశ్రాంత హైకోర్టు జడ్జి నేతృత్వంలో కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు.