
బిల్లుల పెండింగ్ ఎందుకు?
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసిన డీకే అరుణ
- రెండు గ్రామాల్లో ‘డబుల్’ ఇళ్లు కడితే సరిపోతుందా?
- నిధులన్నీ హరీశ్, కేటీఆర్, ఇతర మంత్రులే తీసుకుంటే ఎలా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రారంభ దశలో ఉండడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. హామీ ఇచ్చిన మొత్తం ఇళ్లను మరో రెండున్నరేళ్లలో పూర్తి చేయడం ఎలా సాధ్యమో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. పేదల ఇళ్ల పథకాలపై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడానికి ప్రధాన హామీల్లో రెండు పడక గదుల ఇళ్ల పథకం ఒకటని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సీఐడీ దర్యాప్తు బూచి చూపి, వాటి బిల్లుల చెల్లింపును పెండింగ్‌లో పెట్టడం సరికాదని మండిపడ్డారు. ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తులో తేలిన వివరాలను బహిర్గతం చేయాలని అరుణ డిమాండ్ చేశారు.
సీఎం నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో రెండు పడక గదుల ఇళ్లు కడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. దీనిపై ప్రజలు తమను నిల దీస్తుంటే ఏం సమా ధానం చెప్పాలో తెలి యటం లేదన్నారు. ఎక్కువ నిధులు హరీశ్, కేటీఆర్, ఇతర మంత్రులే తీసుకుంటే ఎలాగన్నారు. హరీశ్ స్పందిస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే పార్టీలకు అతీతంగా పనులు జరుగు తున్నాయని, అరుణ మాటలు సరికాద న్నారు. దీంతో మరి సిద్దిపేట ఇంతలా అభి వృద్ధి చెందిందంటే అది గత కాంగ్రెస్ ప్రభు త్వాల పని కాదా అని అరుణ ప్రశ్నించారు.
అసెంబ్లీలోనూ ‘షీటీమ్స్’ కావాలి!
డీకే అరుణ మాట్లాడుతున్న సమయంలో కొందరు సభ్యులు అడ్డు తగలడంతో ఆమె ‘షీటీమ్స్’ ప్రస్తావన తెచ్చారు. ‘అయ్యా హోంమంత్రి గారు. మీరు తండ్రి సమానులు. సభలో మహిళా సభ్యురాలు మాట్లాడు తుండగా ఇలా అడ్డు తగులుతుంటే మాకు రక్షణ కావాలి. అందుకే సభలో కూడా షీటీమ్స్ అవసరం ఉందనిపిస్తోంది.’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
జాప్యం తగదు: కె.లక్ష్మణ్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఐడీహెచ్ కాలనీ ఇళ్లను చూపి ఓట్లు పొందిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయడం సరికాదని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. నర్సన్నపేట, ఎర్రవల్లిల్లో డబుల్ ఇళ్లు నిర్మిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. హైదరా బాద్‌లో 32 చోట్ల శంకుస్థాపన చేసినా ఎక్కడా పనులు మొదలుపెట్టలేదని స్పష్టం చేశారు.
ముస్లింలకు అన్యాయం: అక్బరుద్దీన్
బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో ముందు నుంచీ ముస్లింలకు మరింత అన్యాయం జరిగిందని మజ్లిస్ సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఆరోపించారు. 2007 నుంచి 2016 వరకు ఇళ్ల మంజూరీలో ముస్లింల వాటా కేవలం 1.36 శాతం ఉందని.. కొత్తగా కేటాయించే ఇళ్లలో వారికి 12 శాతం వాటా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో డబుల్ ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను రూ.9 లక్షలకు పెంచాలన్నారు.
ప్రతి గ్రామం ఎర్రవల్లి కావాలి: సండ్ర
రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఎర్రవల్లి తరహాలో కొత్త ఇళ్లతో కళకళలాడేలా చేయాలని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య కోరారు. వచ్చిన దరఖాస్తుల్లో 2.5 లక్షల మందిని అర్హులుగా తేల్చినట్టు సీఎం చెబితే, గృహనిర్మాణ శాఖ ఆ సంఖ్యను 50 వేలుగా పేర్కొందని... ఈ గందరగోళంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.