ఆ పిటిషన్లను తిరస్కరించా...
హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులు నిబంధనల ప్రకారం లేవని, సాంకేతిక కారణాలతో ఆ పిటిషన్లను తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఆ రకంగా మొత్తం 13 పిటిషన్లను తిరస్కరించినట్టు తెలుస్తోంది. కాగా పార్టీ ఫిరాయించిన 13మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...స్పీకర్కు పిటిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు నిబంధనల ప్రకారం లేనందున తిరస్కరించినట్టు స్పీకర్ చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వ్యక్తిగత హోదాలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఇచ్చిన మరో రెండు పిటిషన్లను కూడా తిరస్కరించినట్టు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తాను ఎక్కడా చెప్పలేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో 11 కోట్లు ఖర్చయ్యాయని మాత్రమే చెప్పానని అన్నారు. ఇలాంటి విషయాల్లో కోడిగుడ్డుపై ఈకలు పీకడం సరికాదని వ్యాఖ్యానించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత కాలంలో అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ నేతలు వరుస పరంపరగా స్పీకర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై మొదట్లో ఇచ్చిన వాటిని మాత్రమే తిరస్కరించారని, ఆ తర్వాత కాలంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వేర్వేరుగా స్పీకర్ కు అనేక పిటిషన్లు ఇచ్చినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. స్పీకర్ తిరస్కరించినట్టు చెబుతున్న పిటిషన్లే కాకుండా ఆ తర్వాత కాలంలో నిబంధనల ప్రకారం అనేక ఫిర్యాదులు ఇచ్చినట్టు పార్టీ పేర్కొంది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ తగిన చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ వచ్చే వారం విచారణకు రానున్న దశలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.