
దేశంలో ఎక్కడా పెట్రోలు ధర ఇంత లేదు
పెట్రోలు, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంతగా దేశంలో మరెక్కడా లేవని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఆ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ప్రజలపై దీనివల్ల తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.
అందువల్ల ఈ అంశంపై చర్చించాల్సిందేనని, అవసరమైతే దీనికోసం జీరో అవర్‌ను రద్దు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలుపై 31 శాతం ప్లస్ నాలుగు రూపాయలు, డీజిల్‌పై 22.1 శాతం ప్లస్ నాలుగు రూపాయల వ్యాట్ విధిస్తున్నారని ఆయన చెప్పారు. ఆ డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వానికే వెళ్తోందని గుర్తు చేశారు. సర్కారు తీరువల్లే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.