సాక్షి, చంచల్‌గూడ: తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఖైదీల సంస్కరణలో విభిన్న ప్రయోగాలు చేసింది. చేస్తూనే ఉంది. తెలిసీతెలియక క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే వారిని నేరస్తులుగా పరిగణించకుండా వారిలో మార్పులు తెచ్చేందుకు వివిధ రకాల వ్యాపారాలను మొదలు పెట్టి అందులో ఖైదీలను భాగస్వామ్యం చేసింది. ఇందులో భాగంగానే జైళ్ల శాక ప్రయోగాత్మకంగా ఆయిల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
ఈ క్రమంలో రాష్ట్ర జైళ్ల శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పాతబస్తీలోని చంచల్‌గూడ ప్రాంతంలో సుధార్ పేరుతో నెలకొల్పిన పెట్రోల్ బంకు విజయవంతంగా వ్యాపారం కొనసాగిస్తుంది. ప్రతి రోజు రూ. 30 లక్షలు అమ్మకాలు జరుపుతుంది. 2013 జూన్‌లో ఈ బంకును ప్రారంభించారు. ప్రభుత్వ బంకు కావడంతో స్వచ్ఛత, తూనికలుకోలతల్లో అవకతవకలకు ఆస్కారం లేకపోవడంతో ప్రజలు ఈ బంకును ఆశ్రయిస్తూ అదిరిస్తున్నారు.
ఖైదీలే ఉద్యోగులు..
సాధారణంగా ఖైదీలను జైళ్లలోనే చూస్తుంటాము. ఇక శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు బయట ప్రపంచంతో అసలు సంబంధాలు ఉండవు. కోర్టులకో, ఆసుపత్రులకో తరలిస్తే తప్ప వారికి బయట ప్రపంచం చూసే అవకాశమే ఉండదు. అలాంటిది జైళ్ల శాఖ నేరుగా వారిని ప్రజల మధ్యకు తెచ్చి సహసం చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని వివిధ జైళ్లలోని సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలను హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు తరలించి వారికి పెట్రోల్ పంపు నిర్వహణకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఖైదీలను ప్రజాసేవాలో భాగస్వామ్యం చేశారు. బంకు ప్రారంభమైన మొదట్లో ఖైదీలకు రోజువారి వేతనం రూ. 70 అందజేశారు. అమ్మకాలు పెరగడంతో ఇటీవల వారి రోజువారి వేతనాన్ని రూ. 110 పెంచారు. బంకు 24 గంటలు పనిచేస్తుంది. షిఫ్ట్‌కు 20 మంది చొప్పున మొత్తం 61 మంది ఖైదీలు మూడు షిఫ్ట్‌ల వారిగా విధులు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఇతర బంకులు బందు పాటించినా ఈ బంకుకు వర్తించదు.
యేడాదికి రూ. 4 కోట్ల ఆదాయం..
నగరంలోని ఇతర పెట్రోల్ బంకులతో పోల్చితే అమ్మకాలు అధికంగా ఉన్నాయి. జైళ్ల శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్థాయికి అభివృద్ధి చెందింది. మొదటి సంత్సరంలోనే రూ. 50 కోట్ల టర్నోవర్ సాధించి సూమారు కోటి రూపాయల ఆదాయం గడించింది. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 100 నుంచి 120 కోట్ల టర్నోవర్‌తో వ్యాపారం కొనసాగిస్తూ రూ. 4 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటుంది. పెట్రోల్ అమ్మకాల్లో దేశంలో ఈ బంకు 8వ స్థానం, తెలంగాణలో 2వ స్థానంలో ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు.
ఉపాధి కల్పనలో మేటి...
ఆదాయం గడించడమే కాకుండా ఉపాధి కల్పనలో కూడా ముందుంది ఈ బంకు. ఈ బంకులో శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన ఖైదీలకు నెలకు రూ. 12 వేల వేతనం చొప్పున 16 మందికి ఉద్యోగం కల్పించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 100 బంకులు నెలకొల్పి ఖైదీలకు ఉపాధి కల్పించేందకు కృషి చేస్తున్నారు జైళ్ల అధికారులు.
వేతనం పెంచే యోచనలో...
ప్రస్తుతం బంకుల్లో పనిచేస్తున్న శిక్ష ఖైదీలకు రోజుకి రూ. 110 వేతనం ఇస్తున్నారు. ఈ శ్రమ దోపిడిపై ‘సాక్షి’ ప్రతినిధి ఆ శాఖ సమావేశాల్లో పలుమార్లు రాష్ట్ర హోంమంత్రి, జైళ్ల శాఖ డీజీతో ప్రస్తావించగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఖైదీలకు రూ. 250 వేతనం పెంచే ప్రతిపాదనను ఆ శాఖ డీజీ ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
ఖైదీల్లో మార్పు తేవడమే లక్ష్యం :
ఖైదీల్లో మార్పు తేవడమే మా ప్రధాన లక్ష్యం. ఆ దిశగా మా శాఖ ఎంతో కృషి చేస్తుంది. ఖైదీల్లో మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసేందుకు విభిన్న కార్యక్రమాలు చేపట్టాము. పెట్రోల్ బంకు నిర్వహణ ఎంతో సంతృప్తినిచ్చింది. మా బంకులో ఆయిల్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన ఆయిల్ విక్రయించి నమ్మకాన్ని చూరగొన్నాము.
- బచ్చు సైదయ్య, సూపరింటెండెంట్ చంచల్‌గూడ జైలు
నాణ్యమైన పెట్రోల్ దొరుకుతుంది:
బంకు ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడే పెట్రోల్ పోయించుకుంటున్నాను. నగరంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన పెట్రోల్ దొరుకుతుంది. బండి మైలేజీ కూడా పెరిగింది. ఖైదీల సేవాలు, జైళ్ల శాక ప్రయత్నం అభినందనీయం.
- దర్శనం పవన్, వినియోగదారుడు