బస్టాండ్‌లోకి వెళ్లాలా.. రూ.5 కట్టాలి | Platform ticket policy also in the bus station | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లోకి వెళ్లాలా.. రూ.5 కట్టాలి

Published Fri, Nov 4 2016 6:52 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

బస్టాండ్‌లోకి వెళ్లాలా.. రూ.5 కట్టాలి

బస్టాండ్‌లోకి వెళ్లాలా.. రూ.5 కట్టాలి

రైల్వే స్టేషన్ల తరహాలో ప్లాట్‌ఫామ్ టికెట్ల విధానం
 
 సాక్షి, హైదరాబాద్: మీ కుటుంబ సభ్యులు, బంధువులెవరినైనా బస్ ఎక్కించేందుకు బస్‌స్టేషన్‌లోకి వెళుతున్నారా.. అయితే మీరూ టికెట్ తీసుకోవాల్సిందే! ఐదు రూపాయలు సమర్పించుకోవాల్సిందే! కారణం... రైల్వేస్టేషన్ల తరహాలో బస్‌స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ విధానాన్ని అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. రోజూ లక్ష మందికిపైగా రాకపోకలు సాగించే హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)లో దీనిని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

 సదుపాయాల కల్పన, సుందరీకరణ
 నగరంలోని ప్రధాన బస్‌స్టేషన్‌లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో సుమారు రూ.13 కోట్ల వ్యయం తో చేపట్టిన అదనపు సదుపాయాల ఏర్పాటు, సుం దరీకరణ పనులు తుది దశకు చేరుకున్నారుు. బయటి నుంచి చూస్తే షాపింగ్ మాల్స్‌ను తలపించే విధంగా సుందరీకరణ పనులు చేపట్టారు. కొత్త మార్బుల్స్‌తో  ఫ్లోరింగ్ పునర్నిర్మించారు. ప్రయాణికులు కూర్చునేందుకు కొత్త సీట్లు ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్‌లో ప్రస్తుతం లోపల ఉన్న సుమారు 20 టికెట్ బుకింగ్ కౌంటర్ల విండోలను బయటి వైపు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు టికెట్ తీసుకున్న తరువాతే లోపలికి ప్రవేశించే విధంగా మార్పులు, చేర్పులు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ప్రయాణికులను మాత్రమేలోనికి రానిస్తూ, తోడుగా వచ్చిన వారికి ప్లాట్‌ఫామ్ టికెట్ ఉంటేనే లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.
 
 టికెట్టేతర ఆదాయం పెంపుపై దృష్టి
 టికెట్టేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఆర్టీసీ పలు ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్)లలో వాణిజ్య కార్యకలాపాలను విసృ్తతం చేసి, అదనపు ఆదాయం పొందేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఎంజీబీఎస్‌లో మినీ థియేటర్లు, షాపింగ్ మాల్స్‌తో పాటు, వాణిజ్య ప్రకటనల కోసం స్థలాన్ని ఏర్పాటు చేస్తారు.
 
 భారీ తెరలు.. మినీ థియేటర్లు
 ప్రస్తుతం ఎంజీబీఎస్‌లో బస్సుల సమాచారం లోపభూరుుష్టంగా ఉంది. ఏ బస్సు ఏ ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉందో తెలుసుకోవడం కష్టం. అనౌన్‌‌సమెంట్ పద్ధతి కొనసాగుతున్నా.. అది కొన్ని ప్లాట్‌ఫామ్‌లకే పరిమితమవుతోంది. అన్ని ప్లాట్‌ఫామ్‌లకు, బయట ఉన్నవారికి వినబడేలా... రైల్వే తరహాలో అధునాతన టెక్నాలజీతో అనౌన్స్‌మెంట్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. బస్సుల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించేందుకు నాలుగు వైపులా నాలుగు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ప్రయాణికులకు వినోదాన్ని కూడా అందిస్తారు. ఇక వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా  ఎంజీబీఎస్‌లో రెండు మినీ థియేటర్లు, మరో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మల్టీలెవల్ పార్కింగ్‌పై కూడా ఆర్టీసీ దృష్టి సారించింది. ఎంజీబీఎస్, జేబీఎస్ చుట్టూ అందుబాటులో ఉన్న స్థలాల్లో ఈ తరహా పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తారు. తద్వారా భవిష్యత్తులో మెట్రో రైలు ప్రయాణికులకు కూడా ఈ పార్కింగ్ ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
 
 బయటి వారిపై నియంత్రణ

 ప్రస్తుతం ఎంజీబీఎస్‌లో సుమారు 72 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నారుు. రోజూ దాదాపు 3,500 బస్సులు ఇక్కడి నుంచి తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారుు. దాదాపు 1.3 లక్షల మంది ప్రయాణికులు ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు. దసరా, సంక్రాంతి వంటి పర్వదినాలు, తీర్థయాత్రలు, వేసవి సెలవుల వంటి సందర్భాల్లో ఈ సంఖ్య రెండింతల వరకు చేరుతుంది. అయితే ప్రయాణికులతో పాటు దాదాపు 10 నుంచి 25 శాతం మంది బయటి వ్యక్తులు (బంధువులు, స్నేహితులు, ఇతరులు వంటి వారు) బస్‌స్టేషన్ లోపలికి వస్తున్నట్లు అంచనా. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు  తీసుకోవడంతోపాటు, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించాలని ఆర్టీసీ యోచిస్తోంది. ప్లాట్‌ఫామ్ టికెట్‌ను ప్రవేశపెట్టి, అవసరం ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement