పశువులను తీసుకెళ్లే వాహనాలను ఆపరాదు
పోలీసులకు సమాచారమివ్వాలని హిందువులకు సూచన
హైదరాబాద్ సిటీబ్యూరో: సెప్టెంబరు నెలలోనే వినాయక చవితి ఉత్సవాలు, బక్రీద్ పండుగ రావడంతో ఇరువర్గాల ప్రజలు సమన్వయంతో వేడుకలు జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో హిందువులు, ముస్లిం పెద్దలతో ఆయన గురువారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అన్నిజోన్‌ల ఏసీపీలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, హిందువులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పెద్దలు లేవదీసిన ప్రశ్నలకు సీవీ ఆనంద్ సమాధానమిచ్చారు. బందోబస్తుతో పాటు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే బక్రీద్ కూడా ఇదే నెలలో ఉండటంతో ముస్లింలు తీసుకొచ్చే పశువులను నేరుగా ఎవరూ ఆపొద్దని హిందూ పెద్దలకు సూచించారు. ట్రాలీలు, లారీల్లో వచ్చే ఈ లోడ్‌లను ఆపడంతో గొడవ జరిగే అవకాశముందని సూచించారు. అలాగే ముస్లింలతోనూ జరిగిన ప్రత్యేక సమావేశంలో వారి సమస్యలను సీవీ ఆనంద్ సావధానంగా విన్నారు.
నిరంతర నిఘా..
నగరంలోకి అక్రమంగా తరలించే పశువులు, ఆవులు, దూడలపై పోలీసులు నిరంతరం నిఘా ఉండనుంది. ప్రధాన ప్రాంతాలతో పాటు జాతీయ రహదారుల్లో 21 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్‌ఐల ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీలు జరుగుతాయి. అలాగే చట్ట ప్రకారంగానే పశువులను తరలిస్తున్నారా అని సర్టిఫై చేసేందుకు వెటర్నరీ డాక్టర్లు విధులు నిర్వర్తించనున్నారు. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు వారు పనిచేయనున్నారు. అలాగే అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన పశువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పశువుల షెడ్డులోకి తరలిస్తారు. ఇప్పటికే ఐదు జోన్‌లో పూర్తయిన షెడ్డుల్లో పశువుల దాణా, గడ్డి, నీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. హైవేలతో పాటు ఫ్రధాన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారని సీవీ ఆనంద్ హిందూ, ముస్లిం పెద్దలకు వివరించారు.
'సమన్వయంతో పండుగలు చేసుకోండి'
Published Thu, Sep 10 2015 6:47 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
Advertisement
Advertisement