కొత్త ఏడాదికి కొలువుల స్వాగతం
9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
నిరుద్యోగులకు సర్కారు తీపి కబురు
జనవరి 11 నుంచి ఫిబ్రవరి 4 వరకు
దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 3న ప్రాథమిక పరీక్ష
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు కొత్త సంవత్సరం తొలి రోజునే రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పోలీసు శాఖ గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. 439 గ్రూప్-2 పోస్టులు సహా వివిధ విభాగాల్లో మొత్తం 796 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్‌డ్ రిజర్వ్, స్పెషల్ పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక దళం.. ఇలా పలు విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ ద్వారా జనవరి 11 నుంచి ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తెలంగాణ పోలీస్ స్టేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ (ఠీఠీఠీ.్టటఞటఛ.జీ)లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 3న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తారు. దానికి వారం ముందు నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పేర్కొన్న పోస్టుల సంఖ్యలో అవసరమైతే మార్పుచేర్పులు చేసే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఏ పోస్టులు ఎన్ని...
స్టైపెండరీ క్యాడెట్ ట్రెయినీ(ఎస్‌సీటీ) పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలివీ..
పోస్టు కోడ్ విభాగం ఖాళీల సంఖ్య
21 సివిల్ 1,810
22 ఆర్మ్‌డ్ రిజర్వ్ 2,760
23 స్పెషల్ అర్మ్‌డ్ రిజర్వ్ 56
24 స్పెషల్ పోలీసు 4,065
25 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు 174
26 డిజాస్టర్ రెస్పాన్స్/ఫైర్ సర్వీసెస్ ఫైర్‌మెన్ 416
-----------------------------------------
మొత్తం 9,281
----------------------------------------
వయోపరిమితి ఇలా..
పోస్టు కోడ్ నెం.21 నుంచి 25 వరకు: జూలై 2015 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. (1990 జూలై 2 - 1997 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి). ఈ పోస్టులకు హోమ్‌గార్డులు దరఖాస్తు చేసుకుంటే.. వారు రెండేళ్ల కాలంలో కనీసం 360 రోజులు విధులు నిర్వహించాలి. వారి వయసు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1982 జూలై 2-1997 జూలై1 మధ్య జన్మించి ఉండాలి.
పోస్టు కోడ్ 26: వయసు 18-33 ఏళ్ల మధ్య ఉండాలి (1982 జూలై 2- 1997 జూలై1) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి సడ లింపు ఇచ్చారు.
విద్యార్హత: జూలై 1, 2015 నాటికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్ పరీక్షలకు హాజరై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.200. మీ సేవ/టీఎస్‌ఆన్‌లైన్/ఏపీఆన్‌లైన్ సెంటర్లలో నిర్ధారిత ఫీజు చెల్లించి రశీదు తీసుకోవాలి. తర్వాత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రాథమిక రాత పరీక్ష: అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 3న జరిగే ప్రాథమిక రాత పరీక్షకు హాజరు కావాలి. ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫై కావాలంటే ఓసీలు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ 30 శాతం మార్కులు పొందాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి దేహ దారుఢ్య పరీక్ష ఉంటుంది.