మూడేళ్లు దాటినా కాంగ్రెస్‌పై నిందలా
హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ వాడకానికి కాంగ్రెస్ కారణమంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడటం దారుణమని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లుగా హోంమంత్రిగా ఆయన చేస్తున్నదేమిటో చెప్పాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ హోంమంత్రి నాయిని వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు.
పబ్స్ అరాచకాలపై నిరసన వ్యక్తం చేసిన యువజన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ విధానమే డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగం, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని విమర్శించారు. పబ్‌ల లైసెన్సులు అన్నింటినీ రద్దుచేయాలని డిమాండ్ చేశారు.ఇసుక లూటీని ప్రశ్నించిన సిరిసిల్ల దళితులపై పోలీసుల అరాచకాలు దారుణమని, దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశాడని, దళితులపై పోలీసుల దాడులతో మంత్రి కేటీఆర్ తమ దళిత వ్యతిరేకతను బయటపెట్టుకున్నారని ఆరోపించారు.