పాప్‌కార్న్ రూ.200 పది కిలోల మక్కలు 150
సాక్షి, హైదరాబాద్: అందరికీ నోరూరించే పాప్‌కార్న్.. బడా షాపింగ్‌మాళ్లు, మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో పాప్‌కార్న్ ప్యాకెట్‌ను రూ.200 చొప్పున అమ్ముతున్నారు. బడా మాల్స్‌లో సినిమా టికెట్‌తో కలిపి కొంటే కాంబో ఆఫర్ పేరుతో రూ.175కు తగ్గించి ఇస్తున్నారు. గ్రేటర్‌లో ఖరీదైన జీవనానికి అలవాటుపడ్డ నగరవాసులకు ఇందులో వింతేముంది అనిపించొచ్చు..! కానీ పాప్‌కార్న్ తయారీకి వాడే మొక్కజొన్న(మక్కలు) పం డించిన రైతు ఈ ధర వింటే బిత్తరపోవటం ఖాయం. రైతులు 4 నెలలు చెమటోడ్చితే మొక్కజొన్న పంట చేతికందుతుంది. కంకులు ఒలిచి.. ఎండబెట్టిన మక్కలను మార్కెట్‌కు తరలించేందుకు రైతులు పడే ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. ఇప్పుడున్న ధరల ప్రకారం మార్కెట్లో క్వింటాలు మక్కలమ్మితే రైతుకు రూ.1,300 నుంచి రూ.1,500 చేతికందుతున్నాయి. ప్రభుత్వం మొక్కజొన్న కు రూ.1,365 మద్దతుధర నిర్ణయించింది.
దళారుల దందా, మార్కెట్ల వరకు రవాణా ఖర్చులు, పడిగాపులన్నీ లెక్కేసుకుంటే ఈ సీజన్‌లో రైతుకు రూ.1,300కు మించి ధర రాలేదు. అవే మక్కలతో తయారు చేసే పాప్‌కార్న్‌ను కొనాలంటే మాత్రం కళ్లు బైర్లు కమ్ముతాయి. ఒక పాప్‌కార్న్ ప్యాకెట్‌లో సగటున 50 గ్రాముల నుంచి వంద గ్రాముల మక్కలుంటాయి. రైతు అమ్మిన ధరతో పోలిస్తే మక్కలకు.. పాప్ కార్న్‌కు అసలు పొంతనే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.. కరెంటు ఖర్చు.. చిటికెడు ఉప్పు.. ఒక స్పూన్ నూనె.. అందమైన బొకే లాంటి ప్యాకెట్.. అన్నీ కలిపినా పాప్ కార్న్ ధర పది రూపాయలు దాటదు. కానీ.. పది కిలోల మక్కలు అమ్మితే రైతుకు వచ్చేది రూ.150 కంటే.. అదనంగా మరో రూ.50 వడ్డించ డమే కార్పొరేట్ కాసుల దందా అంటే..!