సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు చేపట్టిన హోదా ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతుగా నిలుస్తోందంటూ దర్శకుడు రాఘవేంద్రరావుతోపాటు ఐదుగురు సినీ ప్రముఖులు ప్రకటించటాన్ని నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా తప్పుబట్టారు. రాఘవేంద్రరావు, అశ్వనీదత్, కేఎల్ నారాయణ, కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు ఇటీవల చంద్రబాబును కలిసి చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పత్రికల్లో వచ్చిన కథనంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘సినీ పరిశ్రమ చంద్రబాబు వెంట ఉందంటూ మీరు ప్రకటించినట్లు వచ్చిన వార్తా కథనం వల్ల కులం రంగు పులుముకుంది. చంద్రబాబు కమ్మ కులస్తుడైనందున కమ్మోళ్లమంతా ఆయనకు సపోర్టుగా ఉంటాం అన్నట్టుగా ఇది ఉంది..’అని పోసాని గురువారం ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ మండిపడ్డారు. ‘నలుగురైదుగురు సీఎంకు వద్దకు వెళ్లి సినీరంగం మొత్తం మద్దతుగా ఉంటుందని ఎలా చెబుతారు? ఇండస్ట్రీ అంటే మీ ఐదుగురేనా? మోహన్‌బాబు, జూ. ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి లాంటి ప్రముఖులెందరో సినీ పరిశ్రమలో ఉన్నారు.
చంద్రబాబు ఇప్పుడు రాజకీయ అవసరం కోసం ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్నారు. ప్రత్యేక హోదా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే వైఎస్ జగన్ ఉద్యమం చేస్తున్నారు. ఆయనకు ఎందుకు మద్దతు ప్రకటించలేదు? రాష్ట్రానికి హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేపట్టి చావుబతుకుల మధ్య పోరాడారు? మరి మీరు ఢిల్లీ వెళ్లి ఆ ఐదుగురు ఎంపీలకు ఎందుకు సానుభూతి తెలపలేదు? బాబుకే మద్దతిస్తారా? వైఎస్ జగన్‌ది ఉద్యమం కాదా? లెఫ్ట్‌ది, కాంగ్రెస్, చలసానిది ఉద్యమం కాదా?’ అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment