పాత బంగారు లోకం! | Preservation of old goods | Sakshi
Sakshi News home page

పాత బంగారు లోకం!

Published Sun, Feb 22 2015 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

Preservation of old goods

పాత వస్తువులు భద్రం    వంటింటి వస్తువుల నుంచి సైకిళ్ల వరకూ ఇదే సూత్రం మార్కెట్‌లో కొనుగోలుకు సిద్ధం    మొబైళ్లకూ డిమాండ్    ఓఎల్‌ఎక్స్ సర్వేలో వెల్లడి
 
కొంచెం సెంటిమెంట్... మరికొంచెం నాణ్యతపై నమ్మకం... ఓసారి వదులుకుంటే మళ్లీ అలాంటిదే  దొరుకుతుందో లేదోననే సంశయం... వెరసి నగర వాసులు పాత వస్తువులపై మక్కువ పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఇళ్లలో ఉన్నవి భద్రంగా దాచుకోవడం మాత్రమే కాదు...
 
మార్కెట్‌లో...

ఆన్‌లైన్‌లో కనిపిస్తే సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. వంటింటి పాత్రల నుంచి సెల్‌ఫోన్ల వరకూ ‘పాత’ ఒక వింతగా మారిపోతోంది.
 
సిటీబ్యూరో:  ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ (పాతదే బంగారం) అన్న తత్వాన్ని గ్రేటర్ సిటీజనులు బాగానే ఒంటబట్టించుకున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ క్రయ, విక్రయ సంస్థ ఓఎల్‌ఎక్స్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇటీవల దేశవ్యాప్తంగా 16 మెట్రో నగరాల్లో  ఈ సర్వే నిర్వహించారు. మన నగరంలో 85 శాతం మంది ఇంట్లోని పాత వస్తువులను అలాగే అట్టిపెట్టుకునేందుకు ఇష్టపడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఒకసారి వినియోగించి పక్కన పెట్టేసిన వస్తువులను సమీప భవిష్యత్‌లో మళ్లీ వినియోగించాలన్న ఉద్దేశంతో కొందరు... సెంటిమెంట్‌తో మరికొందరు వాటిని దాచుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది. మన నగరంలో 55 శాతం మహిళలు వంటగదిలో వినియోగించే టోస్టర్లు, మిక్సర్లు, గ్రైండర్లు, ఓవెన్లను విక్రయించేందుకు ససేమిరా అంటున్నట్లు తేలింది.

దేశవ్యాప్తంగా  ఇళ్లలో నిల్వ చేసుకున్న పాత వస్తువుల మార్కెట్ విలువ సుమారు రూ.56,200 కోట్లు ఉంటుందని ఈ సర్వే  అంచనా వేసింది. మన గ్రేటర్ విషయానికి వస్తే 2014-15లో 23 శాతం మంది ఆన్‌లైన్‌లో తమకు అవసరమైన గృహ వినియోగ వస్తువులు, పాత వాహనాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఇక ఇతర మహా నగరాల్లో ఇళ్లలో దాచుకుంటున్న వాటిలో పాత వస్త్రాలు 40 శాతం , కిచెన్‌లో వాడే టోస్టర్లు, గ్రైండర్ల వంటివి 34 శాతం, పుస్తకాలు 27 శాతం, మొబైల్స్ 21 శాతం, వినియోగ వస్తువులు 19 శాతం, వంటగదిలోని పాత్రలు 16 శాతం ఉన్నట్లు తేలింది.

ఒక్కసారే చదువుతున్నారు...

ఇక మన గ్రేటర్ నగరంలో పుస్తక ప్రియులు తాము ఒకసారి చదివేసిన అకడమిక్, నవలలు, వ్యక్తిత్వ వికాస రచనలు తదితర పుస్తకాలను తిరిగి విక్రయించడంలో ముందున్నారు. సుమారు 19 శాతం మంది పాత పుస్తకాలను మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు ఈ సర్వే తేల్చింది. ఒకసారి తాము చదివిన పుస్తకాల స్థానే కొత్తవి కొనుగోలుకు వ్యక్తులు ఆసక్తి చూపుతుండడం విశేషం.
 
పాత మొబైల్స్‌పై మక్కువ ఎక్కువే..


మార్కెట్‌లో విడుదలైన స్మార్ట్‌ఫోన్లను ఇట్టే సొంతం చేసుకుంటున్న నగర వాసులు పాత మొబైల్స్‌నూ వదలడం లేదు. ఓఎల్‌ఎక్స్ వంటి సైట్లను ఆశ్రయించి ఏడాదిలో సుమారు 14 శాతం మంది పాత మొబైల్‌ఫోన్లను కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పాత మొబైల్స్ పనితీరు, మన్నిక ఆధారంగానే కొనుగోలు చేస్తుండడం విశేషం.
 
గ్రేటర్‌లో పాత వస్తువుల అమ్మకం... వినియోగం తీరిదీ...

గత ఏడాదిగా గ్రేటర్ పరిధిలో 23 శాతం మంది ఆన్‌లైన్‌లో పాత వస్తువులు కొనుగోలు చేశారు. వంటగదిలో వాడే వస్తువులు, టోస్టర్లు, ఓవెన్స్, మిక్సర్ల వంటి పాత వస్తువులను 55 శాతం మహిళలు ఇళ్లలోనే     భద్రంగా దాచుకుంటున్నట్టు సర్వే తేల్చింది. వీటిని విక్రయించేందుకు వారు ససేమిరా అంటున్నట్లు తేలింది. మన తరువాత చెన్నై నగరంలో 49 శాతం మహిళలు వంటింటి సామగ్రి అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది.

మెట్రో నగరాల్లో...

కోల్‌కతా మహా నగరంలో 85 శాతం మంది పాత వస్తువులను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్తవి కొనుగోలుకు బెంగాలీలు పాత వస్తువులను వదిలించుకున్నట్లు తేలింది. ముంబాయిలో 21 శాతం ఆన్‌లైన్‌లో పాత వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు తేలింది.కోల్‌కతాలో 51 శాతం పాత మొబైల్స్‌ను తమ వద్దే ఉంచుకుంటున్నారు. 33 శాతం మంది పాత మొబైల్ ఫోన్లను విక్రయిస్తున్నారు. లక్నోలో 31 శాతం మంది పుస్తకాలను విక్రయిస్తున్నారు.
 
ఇళ్లలో దాచుకుంటున్న వస్తువులివే..
 
కోల్‌కతాలో 29 శాతం మంది గృహ వినియోగ వస్తువులను ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు.
 చెన్నైలో 32 శాతం చిన్నారులు ఆట బొమ్మలను ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు.
లక్నోలో 19 శాతం మంది పాత సైకిళ్లను ఇళ్లలోనే ఉంచుకుంటున్నారు.
 
సర్వే నిర్వహించిన నగరాలు...

 
ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పాట్నా, గౌహతి, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, చండీగడ్, ఇండోర్, కోచి, భువనేశ్వర్, పూణే.

వృథాను అరికట్టడంపై ఆసక్తి పెరుగుతోంది

దేశ వ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో పాత వస్తువులను తిరిగి వినియోగించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయడంతో పాటు, వస్తువుల వృథాను అరికట్టాలన్న స్పృహ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. పాత వస్తువులను విక్రయించడం ద్వారా కొత్తవి కొనుగోలు చేసేందుకు మా సంస్థ చక్కటి ప్లాట్‌ఫారం ఏర్పాటు చేసింది. మా సంస్థ ద్వారా క్రయవిక్రయాలు జరుపుతున్న వారు ఇటీవల భారీగా పెరిగారు. దేశవ్యాప్తంగా వినియోగించిన పాత వస్తువుల విక్రయ మార్కెట్ సుమారు రూ.56,200 కోట్లు ఉంటుందని అంచనా.
 - అమర్‌జిత్ భాత్రా, సీఈఓ,ఓఎల్‌ఎక్స్ ఇండియా
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement