
మెట్రపొలిస్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చేనెల 9వ తేదీన హైదరాబాద్ రానున్నారు. నగరంలో వచ్చేనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగునున్న ప్రపంచ మేయర్ల సదస్సు (మెట్రో పొలీస్) ముగింపు సమావేశంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. వచ్చేనెల 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకుంటారు.
అక్కడ నుంచి హెలికాప్టర్‌లో హైటెక్స్‌లో జరిగే మెట్రో పొలీస్ ముగింపు సదస్సు ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడి కార్యక్రమాల్లో గంటసేపు పాల్గొన్న అనంతరం, అదేరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. మెట్రో పొలీస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని కూడా కేసీఆర్ కోరడం విదితమే. ఆయన పాల్గొనడంపై ప్రభుత్వానికింకా సమాచారం లేదు. పలు రాష్ట్రాల మహిళా సీఎంలు, లోక్‌సభ స్పీకర్ తదితరులు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడంపైనా ఇంకా సమాచారం లేదు.