మిగిలేది బియ్యమే! | Public distribution system working nominally | Sakshi
Sakshi News home page

మిగిలేది బియ్యమే!

Published Tue, Jun 20 2017 3:00 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

మిగిలేది బియ్యమే!

మిగిలేది బియ్యమే!

- ప్రజా పంపిణీలో ఒక్కో సరుకునూ వదిలించుకుంటున్న ప్రభుత్వం
- సబ్సిడీల భారం భరించలేక చేతులెత్తేస్తున్న వైనం


సాక్షి, హైదరాబాద్‌: పేదలకు సబ్సిడీ ధరలకు నిత్యావసరాలను సరఫరా చేయాల్సిన ‘ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)’నామమాత్రంగా మారిపోతోంది. సబ్సిడీల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఒక్కో నిత్యావసర సరుకును వదిలించుకుంటూ వస్తోంది. పప్పులు, ఉప్పులు వంటివన్నింటినీ పక్కనపెట్టేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం సబ్సిడీ బియ్యం, కిరోసిన్‌లకు మాత్రమే పరిమితమైపోయింది.

బియ్యం భారం తగ్గించుకునేందుకు..
1983లో ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చాక రేషన్‌ షాపుల ద్వారా రూ.2కిలో బియ్యం పథకం ప్రారంభించారు. అప్పటి మార్కెట్‌ రేటుతో పోల్చితే కిలోకు 46 పైసల సబ్సిడీ ఇచ్చారు. 1996లో నాటి సీఎం చంద్రబాబు మార్కెట్లో ధర పెరిగిందని రేషన్‌ బి య్యం ధరను రూ.5.25కు పెంచారు. అయితే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మార్కెట్‌ ధర పెరిగినా.. రేషన్‌ బియ్యం ధరను రూ.2 కు తగ్గించారు. అప్పటి మార్కెట్‌ ధరల లెక్కన కిలోపై రూ.10.50 సబ్సిడీ ఇచ్చారు. అనంతరం కిరణ్‌ సర్కారు రేషన్‌ బియ్యం ధరను రూపాయికి తగ్గించగా.. ఇప్పటికీ అదే ధర కొనసాగుతోంది. ప్రస్తుతం బియ్యం మార్కెట్‌ ధర రూ.26 లెక్కన చూస్తే ప్రభుత్వం కిలోకు రూ.25 సబ్సిడీగా భరిస్తున్నందున ఏటా రూ.2,200 కోట్ల భారం పడుతోంది. దీంతో ఇతర సరుకుల సరఫరా నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంది.

కిరోసిన్‌కూ మంగళం!
సబ్సిడీ కిరోసిన్‌ సరఫరాకూ మంగళం పాడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రేషన్‌ కిరోసిన్‌ ధరను కొద్ది నెలల కింద లీటర్‌కు రూ.15 నుంచి రూ.21కి పెంచారు. వంటగ్యాస్‌ వినియోగం బాగా పెరిగినందున సబ్సిడీ కిరోసిన్‌ సరఫరాను తగ్గించి, ఆనక నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సరఫరా లేదు.. ఆధునీకరణ ఎందుకు?
పౌర సరఫరాల శాఖను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతిని నిరోధించేందుకూ ఈ–పాస్‌ విధానాన్ని తెచ్చింది. రవాణా లారీలకు జీపీఎస్‌ పరికరాలు అమర్చడం, గోదాములు, నిల్వ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు వంటి చర్యలూ తీసుకున్నారు. అంతాచేసి ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ రేషన్‌ దుకాణాలు బియ్యం పంపిణీకే పరిమితం కావడం గమనార్హం.

ఒక్కో రేషన్‌ కార్డుపై అందించే చక్కెర..  500 గ్రాములు
రేషన్‌పై ఇచ్చే ధర.. 6.75 రూపాయలు
ప్రస్తుత మార్కెట్‌ ధర 22.75 రూపాయలు
సబ్సిడీ రూ.16 (కేంద్రం రూ. 9.25, రాష్ట్రం రూ. 6.75)

ప్రస్తుతం చక్కెరపై సబ్సిడీని కేంద్రం ఎత్తివేసింది.దీంతో రేషన్‌ దుకాణాల్లో చక్కెర పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.
మొదట్లో రేషన్‌పై అందజేసినవి: బియ్యం, గోధుమలు,చక్కెర, కిరోసిన్, కందిపప్పు, పామాయిల్‌
అమ్మహస్తంలో అందించినవి: కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, చక్కెర, ఉప్పు, కారం, చింతపండు, పసుపు
మూడేళ్ల క్రితం వరకు: బియ్యం, చక్కెర, కిరోసిన్‌

రేషన్‌ దుకాణాలను మినీ కిరాణ దుకాణాలుగా
మార్చే ఉద్దేశంతో  మార్కెట్‌ ధరపై ఇతర సరుకుల విక్రయానికి కూడా మధ్యలో కొంతకాలం అనుమతించారు. దాంతో సబ్బులు, ఉప్పు, పప్పులు వంటి పలు సరుకులను  రేషన్‌ డీలర్లు విక్రయించినా..అనంతరం అది నిలిచిపోయింది.
ప్రస్తుతం అందుతున్న సరుకులు: బియ్యం, కిరోసిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement