అనిశెట్టి రజితకు అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం
తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో, అనిశెట్టి రజితకు అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పురస్కార ప్రదాత: నారదాసు లక్ష్మణ్‌రావు. గ్రహీత పరిచయం: అన్నవరం దేవేందర్. జనవరి 12న సాయంత్రం 7 గంటలకు కరీంనగర్‌లోని కామ్రేడ్ బి.విజయ్‌కుమార్ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ సభలో బూర్ల వేంకటేశ్వర్లు, అమ్మంగి వేణుగోపాల్, జూకంటి జగన్నాథం, గాజోజు నాగభూషణం, నిజాం వెంకటేశం, బి.నర్సన్ పాల్గొంటారు.
బ్రౌన్ పండిత పురస్కారం 2015
అనువాదంలో కృషికి గుర్తింపుగా ముకుంద రామారావుకు మన్మథ నామ సంవత్సరపు బ్రౌన్ పండిత పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తమ్మినేని యదుకుల భూషణ్ తెలియజేస్తున్నారు. అనువాదం, పరిశోధన, నిఘంటు నిర్మాణంలో కృషికి ఈ పురస్కారాన్ని 2007 నుంచి ఇస్తున్నారు. అదే ఆకాశం, సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, అదే గాలి లాంటి అనువాద కవితా సంకలనాల్ని ముకుంద రామారావు వెలువరించారు.
సాహితీ మాణిక్యం పురస్కారాలు
కవి సీతారం తన తల్లి మాణిక్యం పేరిట ఇస్తున్న ‘సాహితీ మాణిక్యం’ పురస్కారాలకుగానూ 2016 సంవత్సరానికి కవులు శిఖామణి, యాకూబ్ ఎంపికయ్యారు. జనవరి 15న ఉదయం 11 గంటలకు ఖమ్మంలో పురస్కార ప్రదానసభ జరగనుంది. అవార్డు గ్రహీతల కవిత్వ విశ్లేషణ: కోయి కోటేశ్వరరావు, వంశీకృష్ణ. పువ్వాడ అజయ్ కుమార్, ఖాదర్ మొహియుద్దీన్, మువ్వా శ్రీనివాస్, ప్రసేన్, రవి మారుత్ పాల్గొంటారు.
61 పుస్తకాల ఆవిష్కరణ
సౌభాగ్య తన షష్టిపూర్తి సందర్భంగా, తన 61 పుస్తకాలను ఆవిష్కరించ బోతున్నారు. తనికెళ్ళ భరణి ఆధ్వర్యంలో- ఈ సభ, సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ దగ్గరి సన్‌షైన్ హాస్పిటల్‌లోని శాంతా ఆడిటోరియంలో జనవరి 16న సాయంత్రం 6:01కి జరగనుంది.
తొలితరం చిత్రకారుడు మార్చాల పుస్తకావిష్కరణ
జి.యాదగిరి రాసిన ‘తెలంగాణ తొలితరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు’ పుస్తకావిష్కరణ జనవరి 17న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది. ఆవిష్కర్త: కె.వి.రమణాచార్యులు. కారంచేడు బుచ్చిగోపాలం, శ్రీరంగాచార్య, కొడిచెర్ల పాండురంగాచార్యులు, వై.నాగిరెడ్డి, గిరిజా మనోహరబాబు పాల్గొంటారు.
కె.వి.రమణారావుకు చాసో స్ఫూర్తి పురస్కారం
చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారాన్ని 2016కుగానూ ‘పుట్టిల్లు’ కథాసంకలనం వెలువరించిన కె.వి.రమణారావుకు ప్రదానం చేయనున్నారు. జనవరి 17న సాయంత్రం 5:30కి విజయనగరంలోని హోటల్ మయూరలో జరిగే పురస్కార సభలో కె.శ్రీనివాసరావు, మృదుల గర్గ్, కేతు విశ్వనాథరెడ్డి, కమల్ కుమార్, ఎ.కృష్ణారావు, రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, రామసూరి, జి.ఎస్.చలం, చీకటి దివాకర్ పాల్గొంటారు. అనంతరం, చాగంటి తులసి కూర్చిన ‘నీ ఉత్తరం అందింది’తోపాటు, ఆమె హిందీలోకి అనువదించిన కేతు విశ్వనాథరెడ్డి, మెడికో శ్యామ్ కథల పుస్తకావిష్కరణలు కూడా జరుగుతాయి.
‘ఆవిర్భావానంతర’ సంచిక కోసం...
‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొనాలని’ కోరుతూ, ‘ప్రజల పక్షం వహించే కవులు లేరనే అపవాదును తుంచి’వేసే లక్ష్యంతో, కాలనాళిక పేరిట తేబోయే కవితల సంకలనానికి కవులు స్పందించాలని తెలంగాణ రచయితల వేదిక కోరుతోంది. ‘గోలకొండ కవుల సంచిక’ స్ఫూర్తితో తెస్తున్న దీనికి సంపాదకులుగా జయధీర్ తిరుమలరావు, జలజం సత్యనారాయణ వ్యవహరిస్తారు. సంచికను మహబూబ్‌నగర్‌లో జరిగే తెరవే జిల్లా మహాసభల్లో విడుదల చేస్తారు.
చిరునామా: కాలనాళిక, 402, ఘరోండా అపార్ట్‌మెంట్, డి.డి.కాలనీ, హైదరాబాద్-7. ఈమెయిల్: jayadhirtr@gmail.com
పుస్తకావిష్కరణలు.. పురస్కారాలు
Published Mon, Jan 11 2016 3:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM
Advertisement