ముందుకొచ్చిన వారివే కొంటున్నాం..
- రాని వారి నుంచి బలవంతంగా తీసుకోవడం లేదు
- అవసరమైన భూములను భూ సేకరణ చట్టం కింద తీసుకుంటాం
- ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది
- హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్
- ఏజీ వాదనలను రికార్డ్ చేసిన హైకోర్టు
- మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధిత రైతుల పిటిషన్ పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకొస్తే వాటినే కొనుగోలు చేస్తున్నాం తప్ప, ఎవ్వరినీ కూడా భూముల కోసం బలవంతం చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. విక్రయించడానికి సిద్ధంగా లేని వారి భూములు ఈ ప్రాజెక్టు కోసం అవసరమైతే వాటిని భూ సేకరణ చట్టం కింద సేకరిస్తామని తెలిపింది. దీనిని రికార్డ్ చేసుకున్న హైకోర్టు, జీవో 123 ఆధారంగా భూములు ఇవ్వాలని ఎవ్వరినీ బలవంతం చేయవద్దని సూచించింది. ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ జీవో 123పై అభ్యంతరాలుంటే దానిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు తేల్చి చెప్పింది.
భూములను చట్ట ప్రకారమే సేకరిస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను ప్రభుత్వం 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద కాకుండా జీవో 123 కింద బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మెదక్ జిల్లా, తోగుట మండలంలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు అడియాల రంగారెడ్డి, మరో 14 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది శివకుమార్ వాదనలు వినిపిస్తూ, భూముల కోసం అధికారులు రైతులను బెదిరిస్తున్నారన్నారు. స్వచ్ఛందంగా ఇవ్వకుంటే బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారని వివరించారు. 2013 భూ సేకరణ చట్టం కింద భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భూముల విలువ పెరిగిందని, ప్రస్తుతం తమ ప్రాంతంలో ఎకరా రూ.10 లక్షలు ఉందన్నారు. తరువాత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏ ఒక్క రైతు భూమినీ బలవంతంగా తీసుకోవడం లేదని తెలిపారు.
అమ్మాలనుకునేవారి వద్దకు ఓ కొనుగోలుదారులా ప్రభుత్వం వెళ్లి చర్చలు జరిపి ఆ తరువాతనే భూమిని కొనుగోలు చేస్తోందన్నారు. ఒకవేళ భూమిని అమ్మేందుకు ఇష్టం లేకపోతే రిజిస్ట్రేషన్‌కు నిరాకరించే హక్కు అమ్మకపుదారులకు ఉందన్నారు. తమ భూమికి ఎంత ధరైనా చెప్పే హక్కు అమ్మకపుదార్లకు ఉందని, ఎకరా రూ.10 కోట్లు కూడా చెప్పొచ్చునని, ప్రభుత్వానికి ఇష్టం ఉంటేనే కొనుగోలు చేస్తుందన్నారు. భూముల కొనుగోలు ఎలా ఉండాలో ఓ విధానాన్ని రూపొందించి, ఆ మేరకు జీవో 123 జారీ చేశామని కోర్టుకు నివేదించారు.
అమ్మేందుకు నిరాకరించిన వారి భూములు ప్రాజెక్టుల కోసం అవసరమని భావిస్తే వాటిని భూ సేకరణ చట్టం కింద చట్ట ప్రకారం సేకరిస్తామన్నారు.ఈ అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఇదే అంశంపై కోర్టులో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపారు. ఎన్ని వ్యాజ్యాలు దాఖలైనా వాటిన్నింటిలో కూడా చట్టం ప్రకారం వ్యవహరించాలని ఉత్తర్వులు జారీ చేయవచ్చునని, అందుకు తమకు అభ్యంతరం లేదని ఏజీ చెప్పారు. భూములను చట్ట ప్రకారమే సేకరిస్తామని ఏజీ చెప్పడాన్ని రికార్డ్ చేసిన న్యాయమూర్తి, ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.