
క్రమబద్ధీకరణకు అర్హుల వడపోత
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకోసం ప్రభుత్వం అర్హుల వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఉద్యోగుల ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకోసం ప్రభుత్వం అర్హుల వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఉద్యోగుల ప్రతిపాదనలు పంపించాలని ఆర్థిక శాఖ ఇదివరకే అన్ని శాఖలకు లేఖ రాసింది. మార్చి నెలాఖరులో అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, అవసరమైన సమాచారాన్ని వేగంగా పంపించాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీంతో అన్ని శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వడపోత మొదలైంది. ఆర్థిక శాఖ జారీ చేసిన చెక్‌లిస్ట్ ప్రకారం ప్రతిపాదనలను తయారు చేసే పనిలో పడ్డాయి.
ఫిబ్రవరిలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక శాఖ ఈ చెక్‌లిస్ట్‌ను రూపొందించింది. ఇందులో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, స్థానికత వివరాలు, ఉద్యోగంలో చేరిన తేదీ (రుజువు చేసే పత్రం), ఫుల్‌టైమా లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియమితులయ్యారా..? ప్రస్తుత నెలసరి జీతం, ఏ పోస్టులో క్రమబద్ధీకరించాలని ప్రతిపాదిస్తున్నారు..? ఆ పోస్టు మంజూరు తేదీ, జీవో వివరాలు, రోస్టర్ పాయింట్, లోకల్ కేడర్, సంబంధిత పోస్టుకు ఉండాల్సిన అర్హతలు, సదరు ఉద్యోగికి ఉన్న అర్హతలు(ధ్రువీకరణ పత్రాలు), 2014 జూన్ 2 నాటికి ఉద్యోగంలో ఉన్నారా.. ఇప్పటికీ కొనసాగుతున్నారా..? అనే వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఈ చెక్‌లిస్ట్ ప్రకారం అందిన ఉద్యోగుల ప్రతిపాదలను పరిశీలించి క్రమబద్ధీకరణకు అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంటర్ విద్యలో అధికంగా కాంట్రాక్టు ఉద్యోగులు
మరోవైపు మంజూరీ పోస్టులు లేకున్నా ఏళ్లకేళ్లుగా జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న దాదాపు 745 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు సైతం తమను రెగ్యులరైజ్ చేయాలని మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇప్పటివరకు ఆర్థిక శాఖ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం 47 విభాగాల పరిధిలో 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా 5,757 మంది ఇంటర్మీడియెట్ విద్య, 2,473 మంది ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలోనే ఉన్నారు. పంచాయతీరాజ్ పరిధిలో 823, మున్సిపల్ శాఖలో 732, పాఠశాల విద్యా విభాగంలో 714, కళాశాల విద్యా విభాగం పరిధిలో 667, ఉపాధి శిక్షణ విభాగంలో 445, సాంకేతిక విద్యా విభాగంలో 412, మహిళా శిశు సంక్షేమంలో 319. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో 228 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు.