రైలు ‘మాట’ తప్పింది | Railway level crossings exchanged | Sakshi
Sakshi News home page

రైలు ‘మాట’ తప్పింది

Published Mon, May 9 2016 2:07 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

రైలు ‘మాట’ తప్పింది - Sakshi

రైలు ‘మాట’ తప్పింది

- కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ ఎత్తివేత గడువు తూచ్
2017 కల్లా వాటిని తొలగిస్తామంటూ గతంలో హామీ
తాజాగా దాన్ని 2019కు పెంచుతున్నట్టు
ద.మ. రైల్వేకు సమాచారం
‘మాసాయిపేట’ ఘోర దుర్ఘటన జరిగినప్పుడు హడావుడి
స్వయంగా పార్లమెంటులో స్పందించిన ప్రధాని
ఇప్పుడు చల్లబడ్డాక చేతులెత్తేసిన తీరు

 
సాక్షి, హైదరాబాద్: 2014 జూలై 24.. మెదక్ జిల్లా మాసాయిపేట శివారులో కాపలాదారు లేని లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును నాందెడ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనటంతో 20 మంది మృతి.. కొద్దిరోజులకే బీహార్‌లో వేగంగా వస్తున్న రైలు పట్టాలు దాటుతున్న ఆటోరిక్షాను ఢీకొనటంతో 18 మంది దుర్మరణం... వెంటవెంటనే జరిగిన ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపాయి. కేంద్రప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తటంతో స్వయంగా ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రకటన చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత రైల్వే శాఖ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించి కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ అన్నింటినీ 2017 నాటికి తొలగించనున్నట్టు ప్రకటించింది. కానీ... 2017 నాటికి వాటి తొలగింపు సాధ్యం కాదని తాజాగా చేతులెత్తేసింది. మరో రెండేళ్ల గడువు పెంచుకుని 2019 నాటికి వాటిని తొలగించనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీ ఎం రవీంద్రగుప్తాకు సమాచారం అందించింది. దీంతో ఆయన హడావుడిగా అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
 
 నిధులు పుష్కలం.. పనుల్లో జాప్యం..: దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే ఎక్కువ ఆదాయం పొందుతున్న రైల్వే జోన్లలో మూడో స్థానంలో ఉంది. ఏటా దాదాపు రూ. 18 వేల కోట్ల ఆదాయం వస్తోంది. కానీ.. కాపలా లేని గేట్ల తొలగింపునకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు నిధులను ఇవ్వడం లేదు.  వాస్తవానికి దక్షిణ మధ్య రైల్వే కొత్త జీఎం రవీంద్రగుప్తా వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ ఆయనకు రైల్వే బోర్డు నుంచి సరైన సహకారం అందకపోవటంతో సమస్య పరిష్కారం కావటం లేదు.
 
 ‘అనిల్ కకోడ్కర్’ నివేదిక ఏమైంది?: రైల్వేలలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు 2011 సెప్టెంబర్‌లో  కేంద్రం అనిల్ కకోడ్కర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2012లో నివేదికను అందజేసింది. దేశవ్యాప్తంగా 32వేల రైల్వే లెవల్ క్రాసింగ్‌లు ఉంటే వాటిలో 11వేల కాపలాలేని గేట్లు ఉన్నట్లు ఈ కమిటీ గుర్తించింది. 5 ఏళ్ల వ్యవధిలో వీటిని తొలగించాలని సూచించింది. ఇందుకో సం రూ. 50 వేల కోట్లు ఖర్చు అవుతాయని.. ఖర్చు  మొత్తా న్ని ఏడేళ్లలో రాబట్టుకోవచ్చునని ఈ కమిటీ పేర్కొంది. గేట్లు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ కోసం సిబ్బందిని నియమించడం వంటి ఖర్చులు మిగులుతాయని, సరుకు రవాణా, ప్రయాణికుల రవా ణా రైళ్ల స్పీడ్ పెరుగుతుందని పేర్కొంది. తద్వారా రైల్వేల ఆదాయం కూడా పెరుగుతుందని కమిటీ వివరించింది. కానీ ఈ నివేదిక అమలులో పెద్దగా పురోగతి లేదు.
 
 ఇదీ పరిస్థితి..
 దక్షిణమధ్య రైల్వే పరిధిలో
 కాపలాదారున్న లెవల్ క్రాసింగ్స్ :     1,454
 కాపలాదారులు లేని లెవల్ క్రాసింగ్స్:    453
 వీటిలో పరిష్కారం చూపే పరిస్థితి/
 అవసరం లేదన్న ప్రాంతాలు:     68
 అండర్‌పాసులు/ఆర్‌వోబీ/ఆర్‌యూబీలను నిర్మించే ప్రాంతాలు:        133
 గేట్లను ఏర్పాటు చేసి కాపలాదారులను
 నియమించే ప్రాంతాలు:        202
 క్రాసింగ్స్‌ను మూసేసి రోడ్లను వేరే ప్రాంతం మీదుగా మళ్లించేవి:    43
 క్రాసింగ్స్ వద్ద వాహన ట్రాఫిక్ లేనందున మూసేసే రోడ్లు:        7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement