హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 6 శాతం వర్షపాతం నమోదైందని, ఆగస్టు నెలలో 10 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు నర్సింహా రావు చెప్పారు. తెలంగాణలో సాధారణం కంటే 26 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని తెలిపారు. తెలంగాణ 10 జిల్లాలకు గానూ 7 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉందన్నారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 11 శాతం ఎక్కువ వర్షపాతమున్నా, నెల్లూరు జిల్లాలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు.
రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైందని, మిగతా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసిందిని తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 12 శాతం తక్కువ వర్షపాతం ఉంటుందని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం ఏర్పడితేనే రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు నర్సింహా రావు వివరించారు.