
తీవ్ర విషాదం నింపిన ప్రమాదం
హైదరాబాద్: మందుబాబుల ర్యాష్ డ్రైవింగ్కు 9 రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందిన చిన్నారి రమ్యను చూసి తల్లి రాధిక కన్నీటిపర్యంతమయ్యారు. అదే ప్రమాదంలో కాలు విరిగి, యశోద అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం కేర్ ఆసుపత్రికి చేరుకొని.. కూతురు మృతదేహాన్ని చూసి స్పృహకోల్పోయారు. చిన్నారి మృతితో రమ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోస్టుమార్టం కోసం రమ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రమ్య మృతికికారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రాధిక డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన ఆరుగురు విద్యార్థులు నా కూతురిని మళ్లీ తీసుకొస్తారా అని ఆమె విలపించారు. ఇలాంటి రోదన ఏకుటుంబానికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
బంజారా హిల్స్ రోడ్ నంబర్-3లో పీకలదాకా తాగిన బీటెక్ విద్యార్థులు వేగంగా కారునడిపి.. డివైడర్ను ఢీకొని, రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై పడటంతో చిన్నాన్న రాజేష్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. తప్పతాగిన విద్యార్థుల మూలంగా జరిగిన ప్రమాదంలో కటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదకారకులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో రమ్య కుటుంబసభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ పరామర్శించారు. రమ్య మృతి బాధాకరం అన్న ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.