
‘మందు నోటు’కు ఆర్‌బీఐ కళ్లెం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఐదు రూపాయల చిల్లర కొరత కు వ్యాపారులు కనిపెట్టిన చిట్కాకు ఆర్‌బీఐ కళ్లెం వేసింది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఐదు రూపాయల చిల్లర కొరత కు వ్యాపారులు కనిపెట్టిన చిట్కాకు ఆర్‌బీఐ కళ్లెం వేసింది. మద్యం దుకాణాల్లో ఐదు రూపాయల చిల్లరకు బదులు ప్లాస్టిక్ పేపర్‌పై బార్‌కోడ్‌లతో పాటు ‘* 5’ గుర్తు, ‘ఐ ప్రామిస్ టు పే’ అనే హామీని ముద్రించి ఇచ్చేవారు. అయితే భారత కరెన్సీపై మాత్రమే ముద్రించే ‘ఐ ప్రామిస్ టు పే’ అనే ప్రమాణపూర్వక హామీని మద్యం వ్యాపారులు సొంతానికి ఉపయోగించుకోవడాన్ని వివరిస్తూ గత నెల 11న ‘సాక్షి’లో ‘మందునోట్లు’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది.
దీనికి ఆర్‌బీఐ రీజినల్ శాఖ స్పందించి నాణేలు, కరెన్సీకి ప్రత్యామ్నాయ నోట్లు ముద్రించడం నేరంగా పేర్కొంది. దీంతో జాగ్రత్త పడ్డ మద్యం వ్యాపారులు ఐదు రూపాయలకు బదులు ఇచ్చే ప్లాస్టిక్ పేపర్‌పై ‘ఐ ప్రామిస్ టు పే’ అనే శీర్షికను తొలగించారు. ‘ ఈ కూపన్‌తో ఏ వస్తువుపైనైనా ఐదు రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు’ అని ముద్రించి వినియోగదారులకు ఇస్తున్నారు. ఐదు రూపాయల నాణేల కొరత లేదని ఆర్‌బీఐ అధికారులు చెపుతున్నా... వినియోగదారులను తిరిగి దుకాణానికి రప్పించుకునే నెపంతోనే మద్యం వ్యాపారులు కూపన్ల జిమ్మిక్కుకు పాల్పడుతున్నారన్నది సుస్పష్టం.