అతివకు ‘భరోసా’
బాల బాధితులకూ సమగ్ర ఆసరా
అన్ని సేవలూ ఒకే గొడుకు కిందికి
హాకా భవన్‌లో ప్రత్యేక కార్యాలయం
త్వరలో అందుబాటులోకి: పోలీసు కమిషనర్
నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాలు, మూడు మహిళా పోలీసుస్టేషన్లకు బాధిత మహిళలు నుంచి ప్రతి రోజూ 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. మైనర్లు, చిన్నపిల్లలపై జరిగే దారుణాలపైనా నిత్యం అనేక ఫిర్యాదులందుతున్నాయి.
సిటీబ్యూరో: తీవ్రమైన వేధింపులు, దాడులు ఎదుర్కొన్న మహిళలు, చిన్నారులకు ఊరట లభించాలంటే కేవలం కేసు నమోదు చేస్తే సరిపోదు. దీంతో పాటు వైద్య-న్యాయ సహాయాలు, పునరావాసం, కౌన్సెలింగ్ తదితరాలు ఎంతో అవసరం. ప్రస్తుతం వీటి కోసం బాధితులు పోలీసుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అనేక చోట్లకు తిరగాల్సి వస్తోంది. ఇది వారికి ఎంతో ఇబ్బంది కలిగించే అంశం. ఈ సమస్యలకు పరిష్కారంగా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచన నుంచి పుట్టిందే ‘భరోసా’ కేంద్రం. మహిళా దినోత్సవం నేపథ్యంలో మంగళవారం దీని వివరాలు వెల్లడించిన కొత్వాల్.. ఇందుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దేశంలో మరే ఇతర నగరంలోనూ ఈ తరహా సెంటర్ లేదని అధికారులు చెప్తున్నారు.
అంతర్జాతీయ హంగులతో...
లక్డీకాపూల్‌లో ఉన్న హాకా భవన్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ‘భరోసా’ రూపుదిద్దుకుంటోంది. ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్న ఈ కేంద్రం పరిధిలోకే ‘షీ-టీమ్స్’, ‘చైల్డ్ లైన్’ విభాగాలనూ తీసుకువస్తున్నారు. కమిషనర్ నేతృత్వంలో ఉండే కమిటీ పర్యవేక్షణలో పని చేసే ఈ కేంద్రానికి మహిళా ఏసీపీ ఇన్‌చార్జ్‌గా, వివిధ రంగాలకు చెందిన 36 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. వివిధ నేరాల్లో బాధితులైన మహిళలు, యువతులు, బాలికలకు ఈ కేంద్రం సేవలందిస్తుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో పని చేసే ‘భరోసా’లో దాదాపు అంతా మహిళా ఉద్యోగులు, అధికారులే ఉంటారు.
కేసు... కౌన్సెలింగ్... సహాయం...
కుటుంబం, సమాజం, పని చేసే ప్రాంతాల్లో మానసిక, శారీకర, లైంగిక వేధింపులు, నేరాల బారినపడే అతివలు, నేరాల్లో బాధితులుగా మారే బాలికలు భరోసా కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. దీనికి వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునే సిబ్బంది అవసరమైన పోలీసుస్టేషన్, విభాగంలో కేసు నమోదు అయ్యేలా చూస్తారు. వైద్య, న్యాయ సహాయాలు అవసరమైన వారికి వాటిని అందిస్తారు. పునరావాసం, కౌన్సెలింగ్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషిస్తారు. ఈ సహాయ, సహకారాలు అందుతున్న విధానాన్నీ పర్యవేక్షిస్తారు.
వీడియో లింకేజ్ ద్వారా విచారణ...
వివిధ రకాలైన నేరాల్లో బాధితులుగా ఉండి, ఈ కేంద్రం ద్వారా సహాయం పొందిన వారు సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. న్యాయ సాధికారిక సంస్థతో ఒప్పందం ఉన్న నేపథ్యంలో ఈ కేంద్రంలో ఉండే ప్రత్యేక వీడియో లింకేజ్ రూమ్ నుంచి కోర్టుకు సాక్ష్యం ఇచ్చే సౌలభ్యం కల్పించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ విభాగం, పలు స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తూ అవగాహన ఒప్పందాలు చేసుకున్న పోలీసు విభాగం అన్ని సేవల్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చింది.
కొత్వాల్ కల సాకారం
‘భరోసా లాంటి కేంద్రం ఉండాలనేది నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కల. ఆయన కృషి ఫలితంగానే సాకారమవుతోంది. స్త్రీ-పురుషులు సమానమనే స్ఫూర్తిని పెంచే ఈ కేంద్రం ఏర్పాటు సుదీర్ఘ ప్రయాణంలో ఓ అడుగు మాత్రమే.’
- అంజనీకుమార్, అదనపు సీపీ (శాంతిభద్రతలు)
సహాయంతో పాటు పర్యవేక్షణ
‘భరోసా సెంటర్‌ను ఆశ్రయించిన బాధితులకు తక్షణం సహాయ సహకారాలు అందిస్తాం. దీంతో పాటు వారు జీవితంలో పూర్తిగా స్థిరపడేలా, వారికి అన్ని దశల్లోనూ పూర్తిస్థాయి న్యాయం జరిగేలా పర్యవేక్షణ బాధ్యతల్నీ స్వీకరిస్తాం. షీ-టీమ్స్, చైల్డ్ లైన్ తదితరాలనూ దీని పరిధిలోకే తీసుకువస్తున్నాం.’ - స్వాతి లక్రా, అదనపు సీపీ (నేరాలు)
రాష్ట్ర వ్యాప్తంగా అమలు యోచన
‘ఈ తరహా కేంద్రాన్ని ప్రభుత్వం పెలైట్ ప్రాజెక్టుగా నగరంలో ఏర్పాటు చేస్తోంది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వారి విధి నిర్వహణనూ పర్యవేక్షిస్తూ విజయవంతం చేస్తాం. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది.’ - డాక్టర్ టి.ప్రభాకరరావు, జేసీపీ (క్రైమ్స్)
సుదీర్ఘకాలం కొనసాగేలా
ప్రభుత్వ అనుమతితో ఏర్పాటవుతున్న భరోసా కేంద్రం సుదీర్ఘకాలం కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్రం నుంచి నిర్భయ ఫండ్ ద్వారా, రాష్ట్రం నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూర్చుకోవడంతో పాటు కార్పొరేట్ సంస్థల సీఎస్సార్ ఫండ్స్, స్వచ్ఛదంగా ముందుకు వచ్చే ఆస్పత్రులు, ఎన్‌జీఓలను భాగస్వాముల్ని చేశాం. బాధితులకు అన్ని రకాల సహాయసహకారాలు అందడంతో పాటు వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న ‘భరోసా’ త్వరలో ప్రారంభమవుతుంది.’ - ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్