
మహిళా ఇన్‌స్పెక్టర్ వద్ద విచారణ
చెన్నై ,టీ.నగర్: దొంగ వద్ద నుంచి రెండున్నర లక్షల రూపాయలు అపహరించిన మహిళా ఇన్‌స్పెక్టర్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నైలో గత మే లో రైలులో చోరీలు చేసే సాహుల్ అమీన్ అనే యువకుడు అరెస్టు అయ్యారు. కేరళకు చెందిన ఇతను రైళ్లలో ఏసీ బోగీ టికెట్లు తీసుకుని ప్రయాణికుల తరహాలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడేవాడు. ఇదిలాఉండగా రైల్వే పోలీసులకు చిక్కిన సాహుల్ అమీన్ వద్ద 110 సవర్ల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద విచారణ జరపగా తరచుగా చోరీలకు పాల్పడుతూ వస్తున్నట్టు తెలిసింది. ఇందులో చోరీ చేసిన నగలను విక్రయించి నగదును బ్యాంకులో జమచేస్తున్నట్టు తెలిసింది. అతనికి 15 బ్యాంకులలో ఖాతాలు ఉన్నట్లు తెలిసింది.
ఈ బ్యాంకు ఏటీఎం కార్డులు కూడా సాహుల్ అమీన్ వద్ద ఉన్నాయి. ఇదిలాఉండగా పోలీసుల వద్ద సాహుల్‌అమీన్ తన రెండు ఏటీఎం కార్డులు మాయమైనట్టు తెలిపారు. దీనికి సంబంధించి రైల్వే పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. సాహుల్ అమీన్ వద్ద విచారణ జరిపిన పోలీసులు ఈ కార్డులను తీసి ఉపయోగించారా అనే విషయంపై విచారణ జరిగింది. ఇందులో మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ ఒకరు రెండు కార్డులను ఉపయోగించి నగదు తీసుకున్న వివరాలు బయటపడ్డాయి. సాహుల్ అమీన్ ఎటీఎం కార్డు ఉపయోగించి మహిళా ఇన్‌స్పెక్టర్ రూ.2.50 లక్షలు తీసుకున్నారు. ఆమె నగదు తీసుకున్న వీడియో ఆధారాలు కూడా బయటపడ్డాయి. రైల్వేపోలీసులో పని చేసిన సదరు మహిళా ఇన్‌స్పెక్టర్ ప్రస్తుతం చెన్నై క్రైం బ్రాంచ్ విభాగంలో వేప్పేరి కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఈ వివరాలు వెల్లడి కాగానే సెంట్రల్ క్రైం బ్రాంచ్‌లో కలకలం ఏర్పడింది.