వైట్ ‘టాప్’ రోడ్లు | reduse financial burden with white topping of roads | Sakshi
Sakshi News home page

వైట్ ‘టాప్’ రోడ్లు

Published Thu, Jul 30 2015 11:50 PM | Last Updated on Mon, Oct 8 2018 8:34 PM

వైట్ ‘టాప్’ రోడ్లు - Sakshi

వైట్ ‘టాప్’ రోడ్లు

వైట్‌టాపింగ్ రోడ్లతో తగ్గనున్న ఆర్థిక భారం  
30 ఏళ్ల వరకూ తగ్గనున్న నిర్వహణ వ్యయం
జీహెచ్‌ఎంసీకి ఎంతో లాభం
ప్రయోగాత్మకంగా బంజారాహిల్స్‌లో నిర్మాణం

 
 
సిటీబ్యూరో: గ్రేటర్‌లో అధునాతన వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో ప్రస్తుతం సింహభాగం నిధులను రోడ్లకే వెచ్చిస్తున్నారు. అందులోనూ సగటున సుమారు రూ.250 కోట్లు ఏటా బీటీ రోడ్ల రీ కార్పెటింగ్, పాట్‌హోల్స్ మరమ్మతుల వంటి పనులకే వినియోగిస్తున్నారు. వైట్‌టాపింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లయితే ఏటా దాదాపు రూ.5.5 కోట్ల వంతున జీహెచ్‌ఎంసీకి ఆదా కానుంది. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ప్రయోగాత్మకంగా 1.కి.మీ.రోడ్డును సీఎంఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. 30 ఏళ్లపాటు మన్నికగా ఉండే ఈ రహదారులతో  జీహెచ్‌ఎంసీకి సుమారు రూ.22 వేల కోట్ల ఖర్చు తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఎస్‌ఆర్‌డీపీ పనుల అంచనా వ్యయం రూ. 20,600 కోట్లు. అంటే వైట్‌టాపింగ్ వినియోగంతో మిగిలే నిధులతో ఎస్సార్‌డీపీ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయవచ్చు.

 ఏటా రూ.250 కోట్లు
 జీహెచ్‌ఎంసీలో అన్ని రకాల రోడ్ల విస్తీర్ణం 8803.48 కి.మీ.లు. వీటిలో బీటీ రోడ్లు 4052.79 కి.మీ. ఉన్నాయి. వీటి మరమ్మతులు, రీకార్పెటింగ్ పనులకు ఏటా దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చూపుతున్నారు. ఈ నిధులతో  అన్ని రోడ్లకూ మరమ్మతులు చేయడం లేదు. కేవలం వీఐపీలు సంచరించే ప్రాంతాలు.. ప్రధాన రహదారుల్లో మాత్రమే చేస్తున్నారు. అన్ని మార్గాల్లో చేస్తే ఈ వ్యయం ఇంకా పెరుగుతుంది.

వైట్‌టాపింగ్ రోడ్లకు, బీటీ రీకార్పెటింగ్‌కు అంచనా వ్యయంలో తేడా సగటున ఇలా...
►వైట్‌టాపింగ్ రోడ్డు కి.మీ.కు వ్యయం దాదాపు రూ.2 కోట్లు
►ఇవి 30 ఏళ్లపాటు మన్నికగా ఉంటాయి. ఎలాంటి       మరమ్మతులు అవసరం లేదు.
►నిర్వహణ వ్యయం ఉండదు. ప్రయాణం సాఫీగా ఉంటుంది.
►బీటీ రీకార్పెటింగ్/మరమ్మతులకు కి.మీ.కు వ్యయం ఏడాదికి దాదాపు రూ.25 లక్షలు.
►ఈ లెక్కన 30 ఏళ్లకయ్యే వ్యయం రూ.7.5 కోట్లు.
►కి.మీ. రహదారిని పరిగణనలోకి తీసుకుంటే వైట్‌టాపింగ్, బీటీ రీకార్పెటింగ్/మరమ్మతుల మధ్య వ్యత్యాసం రూ.5.5 కోట్లు
►4 వేల కి.మీ. రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే జీహెచ్‌ఎంసీ ఖజానాపై రూ.22 వేల కోట్లు భారం తగ్గుతుంది.
►అంటే సంప్రదాయ పద్ధతిలో రీకార్పెటింగ్/మరమ్మతుల స్థానే వైట్‌టాపింగ్ చేస్తే జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఎంతో మిగులు మాత్రమే కాక.. ►సదరు నిధులతో ఎస్సార్‌డీపీ ప్రాజెక్టు పనులను కూడా చేపట్టవచ్చు.
►ఏటా రోడ్ల నిర్వహణ.. రీ కార్పెటింగ్ పేరిట రూ.వందల కోట్లు వ్యయమవుతున్నా.. రోడ్లు మూణ్నాళ్లకే కొట్టుకుపోయి రాళ్లు తేలుతున్నాయి. వైట్ టాపింగ్‌తో ఈ సమస్య ఉండదు.  
►1. కి.మీ. వైట్ టాపింగ్ పని వారంలో పూర్తి చేయవచ్చు. అదే సీసీ వేయాలంటే నెలలు పడుతుంది.
►హైదరాబాద్ లాంటి నగరాల్లో నెలల తరబడి ట్రాఫిక్ మళ్లింపు అసాధ్యం. దీన్నిబట్టిఅన్నివిధాలుగా వైట్         టాపింగ్ మేలు
►వైట్‌టాపింగ్ రహదార్లపై తక్కువ ఓల్టుల బల్బులు చాలు. దీనివల్ల 50శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
►వాహనాలు స్లిప్ కాకుండా గ్రిప్ ఉండేలా రోడ్డుపై చారలుగా పూత ఉంటుంది. పర్యావరణ హితం.
►గుంతలు, కుదుపులు లేనందున వాహనాల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది.
► తారురోడ్డు పైభాగాన్ని 5 అంగుళాల మందం తొలగించి వేయవచ్చు.
►ఎం 40 గ్రేడ్ సిమెంట్ కాంక్రీట్‌ను వినియోగిస్తారు.
►ఎలాంటి రోడ్డు తవ్వకాలు లేనప్పుడు మాత్రమే 30 ఏళ్లు మన్నిక.
►సిమెంటు మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా బంజారాహిల్స్ రోడ్ నెం.10లో  జీహెచ్‌ఎంసీకి ఎలాంటి ఖర్చు లేకుండా కి.మీ. రోడ్డును వైట్‌టాపింగ్ చేస్తున్నారు. సిటీ సెంటర్‌మాల్ చౌరస్తా నుంచి రెయిన్‌బో ఆస్పత్రి మీదుగా జహిరా నగర్ చౌరస్తా వరకు దీనిని నిర్మిస్తున్నారు.

 బెంగళూరు, చెన్నయ్‌లో...
 ఇప్పటి వరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మాత్రమే మనకు తెలుసు. కొంత మందం బీటీ, మరికొంత మందం సీసీతో అధునాతన రోడ్లకు అల్ట్రాటెక్ సమన్వయంతో సిమెంటు కంపెనీల సమాఖ్య రెండేళ్ల క్రితమే ముందుకు వ చ్చింది. రోడ్డు పనులకు అప్పట్లో ట్రాఫిక్ పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. తొలుత లక్‌డీకాపూల్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు వైట్‌టాపింగ్ రోడ్డు వేస్తే బాగుంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు భావించారు. ఆమేరకు సీఎంఏకు తెలియజేశారు. పనులు ప్రారంభించేందుకు ట్రాఫిక్ మళ్లింపు అవసరమని సీఎంఏ పేర్కొంది. దీనికి ప్రత్యామ్నాయం సూచించాల్సిందిగా ట్రాఫిక్ విభాగాన్ని జీహెచ్‌ఎంసీ కోరింది. నిత్యం  రద్దీగా ఉండే ఆ మార్గంలో మళ్లింపు కుదరదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కాచిగూడ స్టేషన్  వద్ద రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ ట్రాఫిక్‌పై అధ్యయనం, మళ్లింపు ఆలస్యమైంది. హైదరాబాద్‌తో పాటు సీఎంఏ ప్రతిపాదించిన మరో రెండు నగరాలు బెంగళూరు, చెన్నయ్‌లలో ఈలోగా రోడ్ల నిర్మాణం పూర్తయిపోయింది. రెండేళ్ల తర్వాత నగ రానికి మళ్లీ అవకాశం లభించింది. ఈ రోడ్డు నిర్మాణానికి సిమెంట్, ఇసుకతో పాటు ఫ్లైయాష్, పాలిమెరిక్ ఫైబర్ వినియోగిస్తారు.

అన్ని మార్గాల్లోనూ...
నగరంలోని రోడ్లన్నింటి కీ అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించాలనేది జీహెచ్‌ఎంసీ యోచన. ఈ పైలట్ ప్రాజెక్టు  విజయవంతమైతే అన్ని మార్గాల్లోనూ వైట్‌టా పింగ్ చేయించే ఆలోచనలో కమిషనర్ సోమేశ్ కుమార్ ఉన్నారు. నగరాల్లో వైట్‌టాపింగ్ ఎంతో అనువైనదని ఈఎన్‌సీ ధన్‌సింగ్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ఇప్పటికే వైట్‌టాపింగ్‌కు మొగ్గు చూపుతుండగా, మంగళూరులో దాదాపు అన్ని రోడ్లకూ దీన్నే వినియోగిస్తున్నారని సీఎంఏ ప్రతినిధులు తెలిపారు. మైసూర్‌లోనూ  త్వరలోనే 150 కి.మీ.ల మేర వైట్‌టాపింగ్ పనులు జరుగనున్నాయని చెప్పారు.
 
వైట్‌టాపింగ్ రోడ్లకు మన్నిక అధికం  భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డెరైక్టర్ రవీందర్‌రెడ్డి

 బంజారాహిల్స్:  నగరంలో వైట్‌టాపింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో సిటీ సెంటర్‌మాల్ చౌరస్తానుంచి జహిరానగర్ చౌరస్తా వరకు కిలోమీటర్ మేర రోడ్డు వేస్తున్నారు. సిమెంటు తయారీదారుల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణ ం పనులను గురువారం భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డెరైక్టర్ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల వరకు మన్నిక ఉండే ఈ వైట్‌టాపింగ్ రోడ్లు అతి తక్కువ కాలంలో పూర్తవుతాయని చెప్పా రు. సుమారు * 1.80 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని, పూర్తిగా సిమెంటు తయారీదారుల సంస్థ ఈ రోడ్డును నిర్మిస్తోందని ఆయన వివరించారు. నగరంలోనే మొట్టమొదటి ప్రయోగాత్మక రోడ్డుగా ఈ రోడ్డును వేస్తున్నామని వెల్లడించారు. ఆరు రోజుల్లో ఓ వైపు రోడ్డు పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ట్రాఫిక్ రాకపోకలు మొదలవుతాయని చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement