క్రమబద్ధీకరణ దరఖాస్తులపై అధికారుల ఆశలు అడియాసలు
జంట జిల్లాల్లో మొత్తం 1,43,863 దరఖాస్తులు
ఆదాయం రూ.31 కోట్లు మాత్రమే
ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగింపు
ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరకర ఇళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రజల స్పందన అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ప్రభుత్వం ఆశించినంత మేర ఖజానాకు ఆదాయం సమకూరలేదు. ఈ విషయంలో అధికారుల లెక్కలు పూర్తిగా తప్పినట్లేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రమబద్ధీకరణ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సొమ్ము చెల్లించే దరఖాస్తులకు మాత్రం గడువును ఫిబ్రవరి 28 వరకు విధించింది. ఈ మేరకు జంట జిల్లాల కలెక్టర్లు సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. అదనపు కౌం టర్లు ఏర్పాటు చేయడం ద్వారా క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి స్పందన పెరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు.
హైదరాబాద్ జిల్లాలో తక్కువ...
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో క్రమబద్ధీకరణకు ఇప్పటి వరకు 1,43,863 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సొమ్ము చెల్లించిన దరఖాస్తులు 3,036 రాగా, రూ. 31 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఇక ఉచిత దరఖాస్తులు మాత్రం అధికంగానే వచ్చాయి. జిల్లాల వారీగా గమనిస్తే రంగారెడ్డి కంటే హైదరాబాద్ జిల్లాలో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. మొత్తం 29,863 దరఖాస్తులు రాగా, సొమ్ము చెల్లించే కేటగిరికి సంబంధించినవి 136 మాతమే ఉన్నాయి. ప్రాథమిక విలువలో 25 శాతం చెల్లింపుల్లో భాగంగా రూ. 8.01 కోట్లు ఆదాయం మాత్రమే సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1.14 లక్షల దరఖాస్తులు రాగా.. సొమ్ము చెల్లించిన దరఖాస్తులు 2900 ఉన్నాయి. వీటి ద్వారా రూ.23 కోట్ల ఆదాయం సమకూరింది.
గతంలో రాబడి రూ.57.17 కోట్లు
2008లో ఇళ్ల క్రమబద్ధీకరణకు పూనుకున్న ప్రభుత్వం.. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వందలాది ఇళ్లను క్రమబద్ధీకరించి రూ.57.19 కోట్లను రాబట్టగలిగింది. ఇందులో హైదరాబాద్ జిల్లా వాటా రూ.40 కోట్లు. క్రమబద్ధీకరణ ద్వారా కాసుల వర్షం కురుస్తుందని అంచనావేసిన సర్కారు లెక్క తప్పిందన్న అభిప్రాయాలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుత పరిస్థితి గతంలోకంటే దారుణంగా ఉండడంతో గత అనుభవాల గురించి తెలుసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టిందనే విమర్శలు విన్పిస్తున్నాయి.
అప్పట్లో 80 గజాలున్నవే ఎక్కువ..
గతంలో క్రమబద్ధీకరించినవాటిలో 80 చదరపు గజాల్లోపు ఉన్న స్థలాలే అధికం. ప్రస్తుతం కూడా సొమ్ము చెల్లించే కేటగిరి కంటే ఉచిత దరఖాస్తులే అధికంగా వస్తున్నాయి. గతంలో హైదరాబాద్ జిల్లాలో 2,342 , రంగారెడ్డి జిల్లాలో 3,811 ఇళ్లను క్రమబద్ధీకరించారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించడంతో నయాపైసా రాలేదు. జంట జిల్లాల్లో 81-250 చదరపు గజాలకు సంబంధించి 5,170 ఇళ్లు, 251 నుంచి 500 చ.గజాలలోని 1415కి మోక్షం లభించింది. ఆపై విస్తీర్ణం కలిగిన మిగతా వాటిని తిరస్కరించగా, 453 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.
పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు జీవో 60 జారీ..
పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి...అర్హత కలిగిన వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం గత నెల 31న జీవో 60ని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం గత ప్రభుత్వాలు (2002 నుంచి 2014 వరకు) జారీ చేసిన జీవో నంబర్లు 455,456,615,747,58,59 ల ద్వారా ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకుని, డబ్బులు చెల్లించినవి పెండింగ్‌లో ఉన్నట్లయితే వాటిని పరిశీలించటానికి వీలు కల్పించారు.
లెక్క తప్పిందా?
Published Mon, Jan 19 2015 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement