రిచ్‌గా.. వెచ్చగా! | Rich .. warm! | Sakshi
Sakshi News home page

రిచ్‌గా.. వెచ్చగా!

Published Wed, Dec 10 2014 11:58 PM | Last Updated on Mon, Oct 1 2018 1:12 PM

రిచ్‌గా.. వెచ్చగా! - Sakshi

రిచ్‌గా.. వెచ్చగా!

వెల్వెట్ ఘరానాగా ఉంటుంది. ‘ఎవరమ్మా ఈ యువరాణి, అంతఃపురం నుంచి దారి తప్పి ఇటుగా వచ్చిందీ!’ అన్నంత లుక్ ఇస్తుంది. వెల్వెట్ మృదువుగా ఉంటుంది. హృదయానికి దగ్గరగా వచ్చిన ప్రియసఖిలా అనిపిస్తుంది. ఇక చలికాలమైతే... వెచ్చని నెచ్చెలిలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ ఘరాణా యువరాణి... ఆ మృదువైన ప్రియసఖి... ఆ వెచ్చని నెచ్చిలి ప్రత్యేకతలే ఈ వారం మన ‘ముస్తాబు’.   
 
ప్రాచీన కాలంలో ఖరీదైన దుస్తుల జాబితాలో ముందుండే మఖమల్ క్లాత్ ఈ రోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. చలి నుంచి రక్షణగా మారి, కనువిందు చేసే వెల్వెట్ గురించి ఎంత ఎక్కువైనా మాట్లాడుకోవచ్చు. పై నుంచి కిందవరకు ఆపాదమస్తకం వెల్వెట్ వెలుగులతో నింపేయవచ్చు.
 
మఖమల్ మెత్తదనం ఒంటిని అల్లుకుపోతే చలికాలం వెచ్చని హాయితో హొయలు పోవచ్చు అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ల్లు. ‘వెల్వెట్’ అని ఆంగ్లంలో ముద్దుగా పిలుచుకునే ఈ ఫ్యాబ్రిక్‌తో సంప్రదాయ లంగా ఓణీలే కాదు, ఆధునికంగా బ్లేజర్లు, స్కర్టులూ ధరించవచ్చు.
 అనార్కలీ, గాగ్రాచోళీ, కుర్తీలు, టీ షర్ట్స్, బ్లేజర్స్.. ఇలా ఏ తరహా దుస్తుల్లోనైనా మఖమల్ ఇట్టే ఒదిగిపోతుంది. ఏ పాత్రలో పోస్తే నీరు అందులో అంతగా ఇమిడిపోయినట్టుగా మఖమల్‌ని ఎన్ని రకాలుగా మార్చినా, ఎన్ని భాగాలుగా తీసుకున్నా అతివల మేనికి అందంగా ఒదిగిపోతుంది. చూపులకు కాంతిమంతం, చుట్టుకుంటే మృదుత్వం కట్టుకుంటే కనువిందుచేసే సోయగం మఖమల్ సొంతం అంటూ మురిసిపోతారు. చూపరుల మదిని కొల్లగొడతారు.

 కార్పొరేట్ స్టైల్.. బ్లేజర్

ఎరుపు, ఆకుపచ్చ, నలుపు.. ఇలా మంచి కాంతిమంతమైన రంగులో ఉండే వెల్వెట్ బ్లేజర్ లోపల తెలుపు, క్రీమ్ కలర్ షర్ట్ ధరిస్తే ఆధునికంగా కనిపిస్తారు. వెల్వెట్ బ్లేజర్స్‌ను శరీరాకృతికి తగ్గట్టు మంచి ఫిటింగ్ ఉండేలా చూసుకోవాలి. బాటమ్‌గా స్లిమ్ జీన్స్, కాటన్ ట్రౌజర్స్.. లేత రంగులున్నవి ధరించాలి. ఈ తరహా వస్త్రాలంకరణ కార్పొరేట్ ఉద్యోగులకు బాగా నప్పుతుంది.  
 
సాయంకాలం వేడుకగా.

 సాయంకాలం పార్టీలకు వెల్వెట్ ట్రౌజర్స్ ప్రత్యేక  ఆకర్షణీయంగా ఉంటాయి. 1970ల స్టైల్ కావాలనుకుంటే ట్రౌజర్, బ్లేజర్ రెండూ వెల్వెట్‌వి ధరించవచ్చు. వెల్వెట్ ట్రౌజర్ ధరించినప్పుడు టాప్స్‌కి పూర్తి భిన్నమైన రంగులు, క్లాత్‌తో డిజైన్ చేసిన టాప్స్ వాడితే ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇలాంటి వస్త్రధారణ ఫార్మల్‌గానూ, క్యాజువల్‌గానూ బాగుంటుంది.
 
యుక్తవయసుకు నచ్చిన నేస్తం...


టీన్స్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ వెల్వెట్. కురచ డ్రెస్సులను ఇష్టపడే అమ్మాయిలను ఆకట్టుకునే ఫ్యాబ్రిక్ ఇది. అలాగే మృదువుగా ఉండటంతో సౌకర్యంగా అనిపిస్తుంది. పెద్దగా సాగే గుణం ఉండదు. కాటన్ వెల్వెట్ అయితే చెమటను పీల్చుకునే గుణం కూడా ఉంటుంది. తడిగా ఉన్న పొడిగానే చూపులకు కనిపిస్తుంది. అంతేకాదు, చలిని కట్టడి చేసి ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది. దీంతో చలికాలం ఫ్యాషనబుల్ ఫ్యాబ్రిక్‌గా వెలుగొందుతుంది. స్టైల్‌గా, స్మార్ట్‌గా, స్టన్నింగ్‌గా అనిపించే ఫ్యాబ్రిక్ వెల్వెట్ కావడంతో ఈ క్లాత్‌పై మగ్గం పనితీరు పురుడుపోసుకుంది. జర్దోసీ జిగేల్మంటుంది. అద్దాలు మిరుమిట్లుగొలుపుతున్నాయి. చమ్కీలు చమక్కుమంటున్నాయి. అందుకే యుక్తవయసు అమ్మాయిలకు నచ్చిన నేస్తం వెల్వెట్.

తరాల అంతరాలు లేని ఫ్యాబ్రిక్...

రాచరికానికి కొత్త హంగులు అద్దిన ‘మఖమల్’ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి సామాన్యుడిని సైతం పలకరించింది. సింగిల్‌గానే కాదు నీరు ఏ పాత్రలో పోస్తే అందులో ఒదిగిపోయినట్టుగా వెల్వెట్ ఏ ఫాబ్రిక్‌తో కలిస్తే ఆ రూపంతో సొబగులు అద్దుకుంటూ వచ్చింది. కాని తన గుర్తింపును మాత్రం ఏ మాత్రం కోల్పోకుండా అదే హంగు, ఆర్భాటంతో హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది. అంతే డిజైనర్ల లుక్‌ను ఆటోమేటిగ్గా తన వైపుకు తిప్పుకుంది. తన చుట్టూ ప్రదక్షిణలు చేయించింది. చేయిస్తూ ఉంది. సంప్రదాయ తరహాలో ‘కుందనపుబొమ్మల’ను తీర్చిదిద్దే మఖమల్ ఆధునిక తరహాలో ర్యాంప్‌షోలపైనా షార్ట్స్‌గా హొయలు పోతోంది.
 అందుకే చలికాలాన ఈ నెచ్చలితో దోస్తీ కట్టడానికి, మేనికి కొత్త సింగారాలు అద్దడానికి మగువలు ముస్తాబవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement