రాహుల్ విజయ్.. ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సైలెంట్ నేమ్! అతని స్టయిలింగే కనిపిస్తుంటుంది గొప్ప గొప్ప ఈవెంట్లలో.. పెద్ద పెద్ద పార్టీల్లో! కంప్లీట్ డీటేయిలింగ్‌తో స్టయిల్‌ని క్రియేట్ చేస్తాడు క్లాసిక్‌గా! అందుకే ఏ రంగంలోని సెలబ్రిటీలకైనా అతను మోస్ట్ వాంటెడ్ స్టయిలిస్ట్!
రాహుల్ విజయ్ పుట్టి, పెరిగింది ఢిల్లీలో. ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన ఎందరో గ్రాడ్యుయేట్స్‌లాగే అతనూ హార్పర్స్ బజార్‌లో ఫ్యాషన్ ఇంటర్న్‌గా చేరాడు. అయితే ఆరేళ్లలో ఫ్యాషన్ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. ఫ్యాషన్ రంగంలో ఎదగడానికి ఢిల్లీ కన్నా ఆర్థిక రాజధాని, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ముంబై అయితే బెస్ట్ అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా ముంబైలో ల్యాండ్ అయ్యాడు.
హార్పర్స్ బజార్ ఎక్స్‌పీరియెన్స్‌తో వెంటనే అతనికి అక్కడ ‘ఎల్’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కొలువు దొరికింది. ముగ్గురు స్టయిలిస్ట్‌లున్న టీమ్‌ని లీడ్ చేశాడు. అతనిలోని క్రియేటివిటీ, పనిపట్ల అతనికున్న కమిట్‌మెంట్.. రెండేళ్లకే ‘జీక్యూ ఇండియా’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కుర్చీలో కూర్చోబెట్టాయి.. స్టయిలింగ్ కవర్స్, ఫ్యాషన్ ఎడిటోరియల్స్ బాధ్యతలతో. దీంతోపాటు ఈ దేశపు ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ షో ‘లాక్మే ఫ్యాషన్ వీక్’కి డైరెక్టర్‌గానూ ఉన్నాడు రాహుల్ .. ముగ్గురు క్రియేటివ్ డైరెక్టర్స్‌లో ఒకడిగా!
ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. సెలబ్రిటీ స్టయిలింగ్‌లోకీ అడుగుపెట్టాడు రాహుల్.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టికి పర్సనల్ స్టయిలిస్ట్‌గా! పర్సనల్ స్టయిలింగ్‌లో.. ముందుగా క్లయింట్ నేపథ్యం, పర్సనాలిటీ, అభిరుచులు, పాత ఫొటోలు.. వంటివన్నీ స్టడీచేసి ఒక అవగాహన కుదిరాకే స్టయిలింగ్ పట్ల దృష్టిపెడ్తాడు రాహుల్. తను చేసిన ఆ రీసెర్చ్ ప్రకారమే క్లయింట్ డ్రెస్ డిజైనింగ్‌ని డిసైడ్ చేస్తాడు.
ఎందుకంత డీటేయిలింగ్ అంటే ‘మన స్టయిల్‌ని రిఫ్లెక్ట్ చేసేది మన లైఫ్‌స్టయిలే కాబట్టి’అంటాడు. అయితే అతని డిజైనర్స్ లిస్ట్‌లో బ్రాండ్ ఇమేజ్ ఉన్న డిజైనర్సే కాదు అసలు బయటి ప్రపంచానికి తెలియని డిజైనర్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువగా కొత్త కొత్త దేశీ డిజైనర్స్‌నే తన క్లయింట్‌కి ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. ఆ తీరే సెలబ్రిటీ స్టయిలింగ్‌లో అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
అతని స్టయిల్ క్లాసిక్‌గా ఉంటుందనే కాంప్లిమెంట్‌నీ ఇస్తోంది. అందుకే మృణాల్ ఠాకుర్, అర్జున్ కపూర్, రాజ్‌కుమార్ రావు, క్రికెటర్ కేఎల్ రాహుల్ లాంటి సెలబ్రిటీలూ రాహుల్ విజయ్‌ని తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా ఎంచుకున్నారు. జగమెరిగిన డిజైనింగ్ హౌసెస్ అండ్ బ్రాండ్స్‌కీ ఫ్రీలాన్స్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా తన సృజనాత్మక సేవలను అందిస్తున్నాడు రాహుల్ విజయ్.
ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు సొంత ఈస్తెటిక్ సెన్స్‌ని డెవలప్ చేసుకోవాలి. 12 ఏళ్ల నా ఫ్యాషన్ ఎడిటోరియల్స్ ఎక్స్‌పీరియెన్స్ ఫ్యాషన్‌కి సంబంధించి భిన్న దృక్ఫథాన్ని అందించింది. ట్రెండ్స్‌ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, వాటిలోంచి మనదైన స్టయిల్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి వంటి ఎన్నో విషయాలను నేర్పింది. ఇది నా కెరీర్‌కి ముఖ్యంగా పర్సనల్ స్టయిలింగ్‌లోకి వచ్చాక ఎంతో ఉపయోగపడింది. స్టయిలింగ్ అనేది ఇప్పుడు ఇమేజ్ మేకింగ్‌లా మారింది. అందుకే స్టయిలిస్ట్‌ల పాత్ర రోజురోజుకీ పెరుగుతోంది! – రాహుల్ విజయ్
Comments
Please login to add a commentAdd a comment