ఆ రోడ్డు మళ్లీ కుంగింది
ఆ రోడ్డు మళ్లీ కుంగింది
Published Thu, Jun 8 2017 12:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నగరంలోని మల్కాజిగిరి ఆనంద్ బాగ్‌లో రోడ్డు మరోసారి కుంగింది. వాటర్ వర్క్స్ పైప్ లైన్ల కోసం తవ్విన గుంతను సరిగ్గా పూడ్చకుండా దానిపైనే తారు రోడ్డు వేయడంతో.. నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు కుంగింది. గతంలో కూడా ఇక్కడే రోడ్డు కుంగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయాలపాలయ్యారు. అయినా నిర్లక్ష్యం వీడని అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి కుమ్మక్కై నాసిరకం పనులు చేశారు. మళ్లీ అదే ప్రాంతంలో గుంత పడటంతో అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ప్రజల ప్రాణాలు మీదకు తెస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మరో పక్క రోడ్ అండర్ బ్రిడ్జి పనులు జరుతున్న ప్రాంతంలో కూడా పని పూర్తి అయ్యాక సరైన పద్దతిలో మట్టిని పూడ్చకపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోజు ఉదయం అటు నుంచి వెళ్తున్న ఓ డీసీఎం గుంతలో దిగబడిపోయింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
ఒక పక్క వాటర్ వర్క్స్, మరోపక్క జీహెచ్ఎంసీ ఈ పని మాది కాదంటే మాది కాదు అని తప్పించుకుంటున్నారు. చివరికి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడాల్సివస్తోంది. దీనికి తోడు మల్కాజిగిరిలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న పలు కాలనీలు చిన్న వర్షానికి నీట మునుగుతున్నాయి.
Advertisement