పంజా | robbers target panjagutta frequently | Sakshi
Sakshi News home page

పంజా

Published Sun, Jan 26 2014 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

robbers target panjagutta frequently

  • పంజగుట్టే టార్గెట్..చోరులకది అడ్డా
  •  ఇక్కడ ఇలాంటి సంచలనాలెన్నో
  •  ముఖ్య కూడలి..అయినా భద్రత కరువు
  •  
    సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట, న్యూస్‌లైన్: పంజగుట్ట.. నగరం నడిబొడ్డునున్న ఈ ప్రాంతం ముఖ్య కూడలి.. అనేక వ్యాపార, వాణిజ్యాల కేంద్రం.. కూతవేటు దూరంలో సీఎం క్యాంపు కార్యాలయం.. సహజంగానే పోలీస్ భద్రత, బందోబస్తు ఎక్కువగానే ఉంటుందని అంతా భావిస్తారు. కానీ దొంగల తొలి టార్గెట్ ఈ ప్రాంతమే. ఇక్కడ దొంగలు తరచూ పంజా విసురుతున్నారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అనేక దోపిడీలు, బందిపోటు దొంగతనాలు జరిగినా.. వీటిలో కొన్ని తీవ్ర సంచలనం సృష్టించినా సిటీ చరిత్రలో తనిష్క్‌దే అత్యంత భారీ చోరీగా రికార్డులకెక్కింది. పంజగుట్ట ప్రాంతంలో దాదాపు 20కి పైగా ప్రముఖ నగల, వాచ్ షోరూమ్‌లు ఉన్నాయి.

    వీటిలో అనేకం సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం, విభజన బిల్లుపై చర్చ, నగరంలోని పరిణామాల నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అయినా అక్కడికి కూతవేటు దూరంలోనే ఈ భారీ చోరీ జరిగింది. ఈ ప్రాంతంలో దృష్టి మళ్లించి చేసే నేరాలు, పార్క్ చేసిన కార్ల అద్దాలు పగులగొట్టి సొత్తు అపహరించుకుపోవడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం ఇక్కడ తనిష్క్ జ్యువెలర్స్‌లో జరిగిన భారీచోరీ సంచలనం కలిగించింది.
     
     ‘వారం వారం’ పంజగుట్టలో...
     ఆదివారం (2013, సెప్టెంబర్ 8): సీఎమ్‌ఆర్ షాపింగ్ మాల్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెండి వస్తువులు కొన్నారు. అదను చూసి 28 తులాల బంగారం ఎత్తుకుపోయారు.
         
     సోమవారం (2013, ఫిబ్రవరి 11): మోర్ జ్యువెలర్స్‌లో గుజరాత్‌కు చెందిన ఇద్దరు రూ.25 లక్షల విలువైన రెండు వజ్రాల నెక్లెస్‌లు తస్కరించారు.
         
     మంగళవారం (2006, మే 16): జాయ్ అలుక్కాస్‌లో ఐదుగురు దొంగలు పడి రూ.10 కోట్ల విలువైన ఆభరణాలు, వజ్రాలు ఎత్తుకుపోయారు.
         
     బుధవారం (2009, మార్చి 18): తాజ్ డెక్కన్‌లోని బియాడ్ లగ్జరీ వాచ్ షాపు నుంచి రూ.54 లక్షల విలువైన వాచీలు తస్కరణకు గురయ్యాయి.
         
     గురువారం (2012, జనవరి 26): కల్యాణ్ జ్యువెలర్స్‌కు పాత ఆభరణాలు మార్చి కొత్తవి కొనడానికి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ జంట నుంచి రూ.3 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
         
     శుక్రవారం (2013, మార్చి 23): నాగార్జున సర్కిల్ సమీపంలో ఉన్న కమల్ వాచ్ కంపెనీలో రూ.1.5 కోట్ల విలువైన వాచీలు ఎత్తుకుపోయారు.
         
     శనివారం (2014, జనవరి 25): తనిష్క్ జ్యు వెలర్స్‌లో రూ.23 కోట్ల విలువైన 30 కేజీల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. గోడకు రంధ్రం చేసి ప్రవేశించిన చోరుడు తన ‘పని’ పూర్తి చేసుకుపోయాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement