కనుసైగతోనే ఖరీదు! | Robbery in Gaddiannaram Fruit market | Sakshi
Sakshi News home page

కనుసైగతోనే ఖరీదు!

Published Mon, Apr 13 2015 1:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Robbery in Gaddiannaram Fruit market

పండ్ల మార్కెట్లో పక్కా దోపిడీ  
వేలంపాటలో రైతన్నకు దగా
కమీషన్ ఏజెంట్లతో అధికారుల కుమ్మక్కు

 
సాక్షి, సిటీబ్యూరో : ‘అక్కడ కను సైగతోనే క్షణాల్లో ధర ఖరారవుతోంది. అదే సిసలైన ధరగా భావించాలి. కాదు కూడదంటే... కన్నెర్ర చేస్తారు. అభ్యంతరపెడితే అంతే సంగతులు. ఇక ఆ సరుకును కొనకుండా వదిలేస్తారు. వీరి కట్టుబాటు ముందు... గిట్టుబాటు ధర గాల్లో కలుస్తోంది. రైతుల ఆరుగాలం కష్టాన్ని కళ్లెదుటే దోచేస్తున్నా కట్టడి చేసేవారేలేరు.  అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తేలుతుండటంతో కర్షకుల కన్నీళ్లే మిగులుతున్నాయి.’  ఇదీ ... గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో రాజ్యమేలుతోన్న అక్రమాల తీరు.  రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రబిందువుగా ఉన్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో  బత్తాయిల వేలం తీరును ‘సాక్షి’ ప్రత్యక్షంగా పరిశీలించింది. ఈ సందర్భంగా వ్యాపారులు, కమీషన్‌దారులు రైతును దగా చేస్తున్న వైనం బట్టబయలైంది.

బత్తాయి సీజన్ ఊపందుకోవడంతో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు ఇబ్బడి ముబ్బడిగా సరుకు వస్తోంది. ప్రధానంగా అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన రైతులు ఈ మార్కెట్‌కు పెద్దమొత్తంలో బత్తాయిలను తీసుకొస్తున్నారు.  లారీ లోడ్‌ను తూకం వేశాక బత్తాయిలను ఇక్కడి ఫ్లాట్ ఫారంలపై లాట్లుగా పోసి కమీషన్‌దారులు వేలం నిర్వహిస్తున్నారు. అయితే... ఈ వేలం ప్రక్రియ మార్కెటింగ్ శాఖ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో పారదర్శకంగా జరగాలి.

కానీ ఆ దరిదాపుల్లో  సిబ్బంది ఎవరూ కన్పించరు. కమీషన్‌దారులే అన్నీ తామై కార్యాన్ని నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ సిబ్బంది ఒకరిద్దరు ఫ్లాట్‌ఫారాలపై తచ్చాడుతున్నా.... కమీషనర్ వ్యాపారులు నిర్ణయించిన ధరనే గిట్టుబాటు ధరగా నమోదు చేస్తున్నారు. ధర విషయంలో రైతు నోట్లో నుంచి మాట రాకుండానే క్షణాల్లో వేలం ప్రక్రియ ముగిసిపోతోంది. పర్చేజింగ్ లెసైన్స్ లేని వ్యాపారులు వందల మంది ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారు.

కళ్లెదుటే దోపిడీ:
గడ్డిఅన్నారం మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధర పెంచకుండా కమీషన్‌దారులతో ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకొంటారు. వేలం తరుణంలో కమీషన్ వ్యాపారులు, కొనుగోలుదారులంతా రెండు గ్రూపులుగా విడిపోయి వేలం పాటలో పోటీపడుతున్నట్లు భ్రమింపజేస్తారు. వీరంతా బత్తాయి కుప్పల వద్దకు గుంపుగా వచ్చి వేలం పాట ప్రారంభిస్తారు. హిందీలో మాట్లాడుతూ టన్ను వెయ్యి రూపాయలు, 2వేలు, 5వేలు, 10వేలు ఇలా రేటు పెంచుతుంటారు. ఈ తరుణంలో ఖరీదుదారు కనుసైగ చేయగానే కమీషన్‌దారు ఏక్ బార్..., దో బార్... తీన్ బార్.. అంటూ పాటను నిలిపేస్తారు. ఇక అదే అసలైన ధరగా నిర్ణయమైపోతోంది.

వేలం తరుణంలో కమీషన్‌దారులు కోడ్ భాషతో ఎదుటివారికి అర్థంకాని విధంగా వేలం పాట నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ‘చలో... టీకే... అంటూ ఓ వ్యక్తి పాట మొదలు పెడతాడు. అంటే... ‘సరుకు నాణ్యమైంది... దీనికి ధర పెంచండి’ అని అర్థం. అలాగే చలో.... ‘గాడీ పే... దో, తీన్’ అంటూ మరోవ్యక్తి గట్టిగా కేకవేస్తూ పాట మొదలెడతాడు.  అంటే... లాట్ మొత్తంలో  2, 3 క్వింటాళ్లు తరుగు కింద పోతుందని అర్థం. అంటే.. క్వింటాల్‌కు రూ.4వేలు ధర ఉంటే 3 క్వింటాళ్లకు రూ.12వేలు ఆదా అవుతుందని కోడ్ భాషలో సంకేతమిస్తాడు. మరో లాట్ వద్దకు రాగానే కోడ్‌ను మారుస్తూ ‘మాల్ అచ్చా హై..., పచ్‌కడ్  కుచ్ నహీ..’అంటూ కమీషన్‌దారు గట్టిగా అరుస్తాడు.

అంటే ఆ వాఖ్యలకు వ్యతిరేక అర్థంలో ఈ సరుకు బాగోలేదు... ధర తగ్గించమని సంకేతమిస్తాడు. ఇలా ఒక్కో లాట్ వద్ద ఈ ఒక్కో విధంగా కోడ్ భాషను వాడుతున్నారు. ఇందులో మరో విధానంలో కూడా దగాకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారు  బత్తాయి లాట్ నుంచి 4 కాయలను తీసి చేతిలో పట్టుకొంటే రూ.4వేలు తగ్గించమని, అదే 3 బత్తాయిలు చేతిలో పట్టుకొంటే రూ.3వేలు తగ్గించమని కమీషన్‌దారుకు సంకేతమిస్తున్నారు.

ఇలా ఎవరూ గుర్తుపట్టని విధంగా వేలం పాటలో రకరకాల విన్యాసాలతో రైతును నిలువునా దోచేస్తున్నారు. వేలం సమయంలో హిందీలో మాట్లాడుతూ ధర నిర్ణయిస్తుండటంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఆ భాష అర్థంగాక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఆ తర్వాత అసలు ధర తెలుసుకొని తమకు గిట్టుబాటు కాలేదని, సరుకు అమ్మనని రైతు అభ్యంతరం పెడితే... ఇక ఆ సరుకును ఎవరూ కొనకుండా వదిలేస్తున్నారు.

అక్రమాల తీరిది..:
     వేలం పాట ముగియగానే...సరుకు అమ్మిన రైతు, కొన్న వ్యాపారి పేర్లు, వసూలు చేసిన కమిషన్, మార్కెట్ ఫీజు తదితరాలతో ‘తక్‌పట్టీ’(అమ్మకపు రసీదు)ని కమీషన్‌దారు అప్పటికప్పుడే తయారుచేసివ్వాలి. అయితే.. రసీదు స్థానే రైతులకు తెల్లటి చీటీ ఇస్తున్నారు.
♦ సరుకు అమ్మించినందుకు రైతుల నుంచి వసూలు చేయాల్సింది 4 శాతం కమీషన్. కానీ ఇక్కడ కమీషన్‌దారులు 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు.
♦ సరుకు ఎంత నాణ్యంగా ఉన్నా... చూట్ (తరుగు) కింద ఒక టన్నుకు క్వింటాల్ చొప్పున తీసేస్తున్నారు. అలాగే సరుకు పచ్చిగా ఉందనే నెపంతో ‘పచ్‌కడ్’ కింద మరో 5 శాతం కోత విధిస్తున్నారు. సరుకు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి వసూలు చేయాల్సిన 1 శాతం మార్కెట్ ఫీజు కూడా రైతుల నుంచే పిండుకొంటున్నారు.
♦ మార్కెట్‌కు వచ్చిన సరుకును తక్కువగా చూపడంతో పాటు దాని విలువను  థర్డ్ గ్రేడ్‌గా చూపి మార్కెట్ ఫీజును కుదిస్తున్నారు. ఫలితంగా మార్కెటింగ్ శాఖకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. ప్రస్తుతం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు ఏటా రూ.8 కోట్ల ఆదాయం వస్తున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తే ఏటా రూ.16 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నది పచ్చినిజం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement