‘కార్బైడ్‌’పై కయ్యం | Mango, Citrus purchases are stoped in the Gaddiannaram Market | Sakshi
Sakshi News home page

‘కార్బైడ్‌’పై కయ్యం

Published Tue, Apr 11 2017 2:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

‘కార్బైడ్‌’పై కయ్యం - Sakshi

‘కార్బైడ్‌’పై కయ్యం

- సమస్యలు పరిష్కరించాలంటూ వ్యాపారుల మెరుపు సమ్మె
- గడ్డిఅన్నారం మార్కెట్‌లో ఆగిన మామిడి, బత్తాయి కొనుగోళ్లు
- అవస్థలు పడిన రైతులు
- చైర్మన్‌ హామీతో సద్దుమణిగిన వ్యాపారుల ఆందోళన


హైదరాబాద్‌: కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు తమ సమస్యల పరిష్కారానికి రైతు మెడపై కత్తిపెట్టి మెరుపు సమ్మెకు దిగారు. మామిడి, బత్తాయి కొనుగోళ్లు నిలిపివేసి పాలకవర్గం, అధికారులతో బేరసారాలు చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి మార్కెట్‌లోకి అమ్మకానికి వచ్చిన మామిడి, బత్తాయి కొనుగోళ్లు నిలిపిపేయడంతో వివిధ జిల్లాల నుంచి తమ పంటను తెచ్చిన రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. అసలే మద్దతు ధరరాక నష్టాల పాలవుతున్నామని.. సమ్మెతో తమ బతుకులు మరింత అన్యాయమవుతాయని మార్కెట్‌ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు.

ఒక వైపు రైతులు, మరోవైపు వ్యాపారుల ఆందోళనలతో సోమవారం మార్కెట్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి సమాచారం తెలుసుకుని వచ్చిన మార్కెట్‌ చైర్మన్‌ పుటం పురుషోత్తంరావు వ్యాపారులతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం కానరాలేదు. దీంతో సుమారు 604 వాహనాల్లో మామిడి(3వేల టన్నుల మామిడి), 270 లోడుల బత్తాయి (400 టన్నులు) కొనుగోళ్లు ఆగాయి.

వ్యాపారులపై చర్య తీసుకోవాలి: మంత్రి జూపల్లి
కొనుగోళ్లు ఆపేయడంతో ఇబ్బందులు పడుతున్నామని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రైతులు కొందరు విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకురాగా హుటాహుటిన గడ్డిఅన్నారం మార్కెట్‌కు చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కొనుగోళ్లు నిలిచిపోవడానికి దారి తీసిన పరిస్థితిపై మార్కెట్‌ ఎస్‌జీఎస్‌ ఎల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు సమ్మె చేయడాన్ని తప్పుపట్టారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని, అవసరమైతే రైతుల నష్టాన్ని వ్యాపారుల నుంచి వసూలు చేసి వారి లైసెన్సులు రద్దు చేయాలన్నారు. రైతులు నష్ట పోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అధికారులను ఆదేశించారు.

వ్యాపార సంఘ నాయకులతో అధికారుల సమావేశం
వ్యాపార సంఘం నాయకులతో పురుషోత్తంరావు, మార్కెటింగ్, పోలీస్‌ అధికారులు చర్చించారు. కార్బైడ్‌ నిషేధించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంతో తాము నష్టపోతున్నామని, గతంలో రద్దుచేసిన లైసెన్సులను పునరుద్ధరించాలని, అద్దె బకాయిపై న్యాయం చేయాలని అసోసియేషన్‌ ప్రతి నిధులు తాజుద్దీన్, అశోక్‌లు డిమాండ్‌ చేశారు. సమస్యలపై సమ్మె నోటీసు ఇచ్చినా అధికారులు స్పందించటం లేదని అందుకే మెరుపు సమ్మె చేయడం జరిగిందన్నారు. నెలరోజుల్లోగా తమ పరిధిలో ఉన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తానని చైర్మన్‌ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో మధ్యాహ్నం 3 గంటలకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెటింగ్‌ జేడీ రవికుమార్, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మలిపెద్ది వెంకట్రామ్‌రెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.

కొనుగోళ్లు ఆలస్యమైతే తీవ్రంగా నష్టపోతాం
ఏడాదంతా శ్రమకోర్చి పండించిన పంటను 100 కిలోమీటర్లు రవాణా చేసి తీసుకొస్తే వ్యాపారులు కొనకపోతే తీవ్రంగా నష్టపోతాం. ఎండ వేడికి లారీల్లోని మామిడి పాడైపోయి మరింత నష్టపోతాం. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
    – పైలా యాదిరెడ్డి, రైతు, ఒలిగొండ, యాదగిరిగుట్ట జిల్లా

వ్యాపారుల తీరు అన్యాయం
అప్పులు చేసి వడ్డీలు కట్టి పంట పండిస్తే మార్కెట్‌లోకి వచ్చిన తరువాత వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. గత సంవత్సరం మామిడి కిలో 50 నుంచి 70 ధర పలకగా ఈఏడాది 25 మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మూలంగా తీవ్ర అన్యాయం జరుగుతోంది.
    – సుగూర్‌ శాంతన్, రైతు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌జిల్లా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement