రూ. 41.40 కోట్లతో చెత్త డబ్బాలు
గ్రేటర్ ప్రజలకు త్వరలో అందుబాటులోకి ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలు
మొత్తం 44,04,568 డబ్బాలు
తడి చెత్తకు గ్రీన్, పొడి చెత్తకు బ్లూ కలర్‌లో...
సిటీబ్యూరో గ్రేటర్ పరిధిలో ఇంటింటి నుంచి చెత్తను తరలించేందుకు రెండు రంగుల చెత్తడబ్బాలు త్వరలోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్‌ంఎసీ ఉచితంగానే వీటిని నగర ప్రజలకు అందజేయనుంది. తొలి విడత స్వచ్ఛ హైదరాబాద్ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేసేందుకు ప్రభుత్వమే ఉచితంగా రెండు డబ్బాలను అందజేస్తుందని హామీ ఇవ్వడం తెలిసిందే. అందుకనుగుణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు అప్పటినుంచే చర్యలు ప్రారంభించారు.
గ్రేటర్‌లోని కుటుంబాల సంఖ్య, అదనపు అవసరాలు, తదితరమైనవి దృష్టిలో ఉంచుకొని మొత్తం 44,04,568 చెత్త డబ్బాలు అవసరమని అంచనా వేశారు. నిర్ణీత ప్రమాణాల మేరకు ఒక్కో చెత్తడబ్బాకు కనీసంగా రూ. 94 ఖర్చు కానుందని స్థానిక మార్కెట్ నుంచి పొందిన కొటేషన్ల ద్వారా అంచనా వేశారు. ఆ మేరకు గ్రేటర్‌లోని అన్ని కుటుంబాల ప్రజలకు అందజేసేందుకు రూ. 41 కోట్ల 40 లక్షల 29 వేల 392 ఖర్చు కాగలదని ప్రతిపాదించారు. సదరు నిధులు వినియోగించేందుకు పరిపాలనపర అనుమతులివ్వాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అన్నీ పరిశీలించిన ప్రభుత్వం ఆ మేరకు బుధవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మునిసిపల్ ఘనవ్యర్థాల నిర్వహణకు సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలను పాటించాలని జీవోలో పేర్కొంది. చెత్తడబ్బాల కొనుగోలుకు జీహెచ్‌ఎంసీ నిధులను వినియోగించాలని స్పష్టం చేసింది. నిధుల వినియోగానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఇక ఈ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్లను ఆహ్వానించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక నగర ప్రజలకు అవి అందుబాటులోకి రానున్నాయి.
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జీహెచ్‌ఎంసీలో 19,57,585 కుటుంబాలున్నాయి. అదనపు అవసరాలు, తదితరమైనవాటిని పరిగణనలోకి తీసుకొని ఇంటికి రెండు డబ్బాల చొప్పున (అదనపు అవసరాల దృష్ట్యా 12.5 శాతం అదనపు డబ్బాలతోసహ) మొత్తం 44,04,568 డబ్బాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇళ్లనుంచి చెత్తను తరలించేందుకు సిపెట్ ప్రమాణాల మేరకు చెత్త డబ్బాలను సరఫరా చేయగల సంస్థలనుంచి టెండర్లు ఆహ్వానించనున్నారు. ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2000, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(న్యూఢిల్లీ), హైకోర్టు ఆదేశాల మేరకు ఇళ్లనుంచి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించాల్సి ఉంది. ఘనవ్యర్థాల నిర్వహణ, 2014 ముసాయిదా నిబంధనల మేరకు తడి వ్యర్థాలకు ఆకుపచ్చ(గ్రీన్), పొడి వ్యర్థాలకు నీలి(బ్లూ) రంగు డబ్బాలు వినియోగించాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో కుటుంబానికి సగటున ఐదుగురు వ్యక్తుల చొప్పున లె క్కించి 12 నుంచి 15 లీటర్ల సామర్ధ్యం కలిగిన చెత్తడబ్బాలు అవసరమని ప్రతిపాదించారు.