ఆర్టీఏ అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్: ఆర్టీఏ అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. బస్సు డివైడర్‌ను ఢీకొన్న పట్టించుకోకుండా అలాగే వెళ్తుండటంతో అనుమానం వచ్చిన ఆర్టీఏ అధికారులు బస్సును నిలిపివేసి తనిఖీలు చేయగా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. దీంతో అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రయాణికులను ఇతర వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు.
ఈ సంఘటన నగరశివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తున్న AP28 TA 6599 భారతి ట్రావెల్స్ బస్సు హయత్‌నగర్ శివారులోని పెద్దఅంబర్‌పేట్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ విషయం గమనించని డ్రైవర్ యాదగిరి బస్సును అలాగే ముందుగు పోనిచ్చాడు. ఇది గుర్తించిన ఆర్టీఏ అధికారులు బస్సును వెంబడించి డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గమనించి అతన్ని హయత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.