ఆ దుప్పట్లు ఉతికేది ఎన్ని నెలలకో? | RTC AC buses to travel at night is hell | Sakshi
Sakshi News home page

ఆ దుప్పట్లు ఉతికేది ఎన్ని నెలలకో?

Published Mon, Feb 29 2016 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

ఆ దుప్పట్లు ఉతికేది ఎన్ని నెలలకో?

ఆ దుప్పట్లు ఉతికేది ఎన్ని నెలలకో?

ఆర్టీసీ ఏసీ బస్సుల్లో రాత్రి ప్రయాణాలు నరకం..
క్లీనింగ్ కాంట్రాక్టు నిర్వహణ లోపభూయిష్టం
పట్టించుకోని యాజమాన్యం

 
 సాక్షి, హైదరాబాద్: సురక్షితమైన.. సుఖవంతమైన ప్రయాణం ఆర్టీసీతోనే సాధ్యం... ఆర్టీసీ చెప్పే ప్రధాన స్లోగన్‌లలో ఇది ముఖ్యమైంది. ఇందులో సురక్షితం మాటెలా ఉన్నా.. సుఖవంతమైన ప్రయాణం మాత్రం ప్రయాణికులకు కరువవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏసీ బస్సుల్లో రాత్రివేళ ప్రయాణాలు నరకాన్ని చూపుతున్నాయి. ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తే అంటువ్యాధులు ఫ్రీ అని ప్రయాణికులంటున్నారంటే సేవల తీరెలా ఉందో విదితమవుతోంది. ఇందుకు కారణం బస్సుల్లో అందించే బ్లాంకెట్లు, బెడ్‌షీట్లు దుర్వాసన వెదజల్లడంతోపాటు అపరిశుభ్రతతో కూడుకోవడమే. ప్రైవేటు సర్వీసులకంటే మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రయాణికుల ఆదరణ చూరగొనాల్సిన ఆర్టీసీ సేవలు అథమంగా ఉంటున్నాయి.

రాష్ట్రవిభజన తర్వాత ఆర్టీసీ ఏపీలో 307 ఏసీ బస్సుల్ని వివిధప్రాంతాలకు నడుపుతోంది. ఇందులో వెన్నెల, గరుడ ప్లస్ బస్సుల్లో సేవలు ఫర్వాలేదనిపిస్తే, ఇంద్ర, గరుడ బస్సుల్లో రాత్రివేళ ప్రయాణమంటే బెంబేలెత్తిపోవాల్సిందే. చిరిగిన బ్లాంకెట్లు, దుర్వాసన వెదజల్లే ఉలెన్ బ్లాంకెట్లు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణికులు చర్మవ్యాధులు, అంటువ్యాధుల బారిన పడుతున్నారు. ప్యాసింజర్ సెస్ పేరిట టికెట్‌పై రూ.3 నుంచి రూ.5 వసూలుచేస్తూ ఏటా రూ.250 కోట్లవరకు భారం మోపుతున్నా.. ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలు అథమంగా ఉంటున్నాయి. బస్సెక్కితే సీట్లలో నల్లులు, అధ్వాన సేవలంటూ సాక్షాత్తూ రవాణామంత్రి శిద్ధా రాఘవరావు వ్యాఖ్యానిస్తున్నారంటే.. పరిస్థితేంటో విదితమవుతోంది. రైళ్లలో దుప్పట్లు ఉతికేది రెండు నెలలకోసారి మాత్రమేనని సాక్షాత్తూ రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్‌సిన్హా రాజ్యసభలో పేర్కొన్నారంటే.. ఇక ఆర్టీసీబస్సుల్లో దుప్పట్లను ఉతికేది ఎన్ని నెలలకోననే సందేహం తలెత్తుతోంది.

 ప్రైవేటుకు అప్పగించడం వల్లే..
 ఏసీ బస్సుల నిర్వహణనంతటినీ ప్రైవేటువ్యక్తుల చేతుల్లో పెట్టడమే సేవలు అథమంగా ఉండడానికి ప్రధాన కారణం. ఏటా టెండర్లద్వారా ఆర్టీసీ ఏసీ బస్సుల క్లీనింగ్, బ్లాంకెట్ల క్లీనింగ్, అటెండర్ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. కాంట్రాక్టు పొందినవారు ఏసీ బస్సుల నిర్వహణను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. రూ.కోట్ల సొమ్ము ప్రైవేటు కంపెనీలకు చెల్లిస్తున్నా.. సేవలు ఘోరంగా ఉంటున్నాయి. ఏసీ బస్సుల్లో సీటుకొకటి చొప్పున రాత్రిపూట ప్రయాణంలో అందించే బ్లాంకెట్లను ఒక ప్రయాణానికే వినియోగించాలి. కానీ బస్సులో డ్రైవర్‌కు సహాయకుడిగా ఉండే అటెండర్ కాంట్రాక్టు పొందిన సంస్థకు చెందినవారవడంతో ప్రయాణికులు దిగిపోగానే.. బ్లాంకెట్లు, బెడ్‌షీట్లను మడతపెట్టి తిరుగు ప్రయాణానికీ వాటినే వాడుతున్నారు. క్లీనింగ్ లేకుండా రెండు,మూడు దఫాలు ఇలా వినియోగించడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

 ఫిర్యాదుకు లేని అవకాశం..
 ఏసీ బస్సుల్లో అసౌకర్యాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రయాణికులకు అవకాశమే లేకుండాపోయింది. ప్రయాణికులనుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే అవకాశాన్ని కల్పించకపోగా.. కనీసం ఓ లాగ్‌బుక్ అందుబాటులో ఉంచడమో లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ద్వారా ఫిర్యాదు చేసేందుకూ తావులేదు. ఒకవేళ ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలుకుతున్నారేతప్ప పట్టించుకోవట్లేదనేది ప్రయాణికుల భావనగా ఉంది. రోజుకు సగటున ఏపీలోని ఏసీ బస్సుల్లో పదివేల మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సేవలు మెరుగ్గా ఉంటే ప్రైవేటు బస్సుల్ని ఎందుకు ఆశ్రయిస్తామని పలువురు అంటున్నారు. ఏసీ బస్సుల్లో సేవలపై వివరణనిచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సుముఖత వ్యక్తపరచకపోవడం గమనార్హం.
 
 ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు అధికం..
 దుస్తులు లేదా పడకల్ని పరిశుభ్రంగా ఉంచకపోతే కంటేజియస్ లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లకు అవకాశముండే జబ్బులొస్తాయి. ఆర్టీసీ బస్సుల విషయానికొస్తే సీట్లపై వేసే దుస్తులుగానీ, టవల్స్‌గానీ మార్చకపోతే ఒకరినుంచి ఒకరికి ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశమెక్కువ. అంతేగాక స్కిన్ అలర్జీలు వచ్చే వీలుంటుంది. ఒక్కోసారి చికెన్‌ఫాక్స్ ఉన్నవాళ్లు ప్రయాణించిన సందర్భాల్లో అలాంటి దుప్పట్లను శుభ్రం చేయకుంటే మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ.   
 -డా.ఉమ,చర్మవ్యాధి నిపుణులు, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement