సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వేతన సవరణ అంశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పక్కనపెట్టడంతో కార్మిక సంఘం నేతలు సందిగ్ధంలో పడ్డారు. నోటీసు ఇచ్చినంత మాత్రాన సమ్మెకు దిగినట్టు కాదని.. ఇది బెదిరింపో, బ్లాక్‌మెయిలింగో కాదని మంత్రివర్గ ఉప సంఘానికి విన్నవించుకున్నారు. తమ బాధను సహృదయంతో అర్థం చేసుకుని వేతన సవరణ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
కార్మిక సంఘాలు వేతన సవరణ జరపాలని డిమాండ్ చేసే క్రమంలో ముందుగానే సమ్మె నోటీసు ఇవ్వడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు మార్గం సుగమం చేస్తూ బుధవారం రాత్రే సీఎం ప్రకటన చేశారు. ఇదే సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కానీ గుర్తింపు కార్మిక సంఘం ముందుగానే సమ్మె నోటీసు ఇవ్వటం, దీనికి పోటీగా మిగతా సంఘాలు నోటీసు ఇవ్వటంతో ఆగ్రహించిన సీఎం కేసీఆర్... బుధవారం నాటి సమావేశంలో ఆర్టీసీ పీఆర్సీ అంశాన్ని పక్కన పెట్టారు. విలేకరుల సమావేశంలోనూ ఆర్టీసీ అంశాన్ని ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే చేసుకొమ్మనండి అని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవేళ సమ్మెకు దిగితే అణచివేసే ధోరణితో ఉన్నట్టు ఆయన మాటలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మంత్రులను కలసి విజ్ఞప్తి..
సీఎం ఆగ్రహం నేపథ్యంలో మొదటికే మోసం వచ్చేలా ఉందని గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ముఖ్య నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వారు గురువారం మంత్రివర్గ ఉప సంఘంలోని సభ్యులను విడివిడిగా కలిసి మాట్లాడారు. తాము ప్రభుత్వంపై అసంతృప్తిగా లేమని.. సమ్మె నోటీసు ఇచ్చినంత మాత్రాన సమ్మె చేస్తున్నట్టు కాదని వివరించారు. కార్మిక సంఘాలు ఇలా సమ్మె నోటీసు ఇవ్వటం ఓ ఆనవాయితీయే తప్ప బెదిరింపో, బ్లాక్‌మెయిలింగో కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరినట్టు తెలిసింది. ఉద్యమకాలం నుంచి తాము కేసీఆర్‌తో కలసి ఉన్నామని, ఇప్పుడూ వెంట ఉన్నామని.. దీనిని సహృదయంతో అర్థం చేసుకుని తమ వేతన సవరణపై సానకూల నిర్ణయం తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఆర్టీసీ పీఆర్సీపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఇప్పటికే రెండు దఫాలు కార్మిక సంఘం, అధికారులతో చర్చించారు.
ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే సీఎం ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో నివేదిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశముంది. మొత్తంగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇప్పటికిప్పుడు ఫిట్‌మెంట్ ప్రకటించకుండా కొంత మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment