సోమవారం సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై మంత్రులు, అధికారులతో సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికులకు ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం మల్లగుల్లాలు
సోమవారం సుదీర్ఘంగా మంతనాలు జరిపిన కేబినెట్ సబ్‌కమిటీ
కమిటీలోకి కొత్తగా తలసాని, జగదీశ్‌రెడ్డి
సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు భారీగా ఫిట్‌మెంట్ ప్రకటి స్తే సంస్థపై పడే భారాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్టీసీ నష్టాలను నియంత్రించడం, లాభాల బాటలోకి తీసుకురావడం, ప్రభుత్వపరంగా చేయూత వంటి అంశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సోమవారం ఆర్థిక, వాణిజ్య శాఖలు, ఆర్టీసీ అధికారులతో సమావేశమైంది. 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తే భారం చాలా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో.. కొంతమేర తగ్గేలా ఒత్తిడి తేవాలని అభిప్రాయానికొచ్చింది. ఎంతశాతం వరకు ఫిట్‌మెంట్ ఇస్తే సంస్థపై ఇప్పటికిప్పుడు పెనుభారం పడబోదనే దిశలో చర్చలు జరిగాయి. ఆర్టీసీ కార్మికుల అంశంపై మంత్రులు నాయిని, ఈటల, మహేందర్‌రెడ్డిలతో ఆదివారం ఏర్పాటు చేసిన కమిటీలోకి సోమవారం మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌లను కూడా సీఎం చేర్చారు.
వారు ఆదివారం కార్మిక సంఘాలతో చర్చకు సంబంధించిన వివరాలను సోమవారం ఉదయం సీఎం కేసీఆర్‌కు వివరించారు. కార్మికులు 43 శాతం ఫిట్‌మెంట్‌పై పట్టు వీడడం లేదని వారు పేర్కొన్నారు. దీంతో సీఎం వెంటనే ఆర్థిక, వాణిజ్యపన్నులు, ఆర్టీసీ అధికారులను కూడా పిలిపించి మంత్రుల సమక్షంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడం, ప్రభుత్వ పరంగా చేయూత తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ అంశాలపై లోతుగా పరిశీలన జరిపి తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్.. మంత్రుల కమిటీని ఆదేశించారు. ఈ మేరకు కమిటీ సచివాలయంలో అధికారులతో భేటీ అయి దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం చర్చించిన అంశాలివే
ఫిట్‌మెంట్..
→ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 43% ఫిట్‌మెంట్‌తో తీవ్ర భారం పడుతుంది. అది సాధ్యంకాదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోగలిగితే ఫిట్‌మెంట్‌ను 36 శాతానికి కాస్త అటూఇటూ వరకు తీసుకెళ్లవచ్చు.
→ఒకవేళ 43% ఫిట్‌మెంట్ ఇస్తే 40% వరకు బస్సు చార్జీలు పెంచాల్సిందే. ఇది ప్రయాణికులపై పెను భారమే. దీంతో ఏటా 15% చొప్పున మూడేళ్లపాటు లేదా 12-13% చొప్పున నాలుగేళ్లపాటు చార్జీలు పెంచాలి. ఇతర రాష్ట్రాల్లో మనకంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువగా ఉన్నందున దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
ఆర్టీసీపై భారం తగ్గింపు..
→ ఆర్టీసీ డీజిల్‌పై 27 శాతం వరకు వ్యాట్ చెల్లిస్తోంది. దీనిని రీయింబర్స్ చేయాలని కోరుతోంది. ఈ మొత్తం ఎంత? దాన్ని ప్రభుత్వమే భరిస్తే పరిస్థితేమిటి? అనే విషయంలో వాణిజ్యపన్నులు, ఆర్థిక శాఖ అధికారులతో వాకబు చేశారు. విడిభాగాలపై ఆర్టీసీ 14.5 శాతం పన్ను చెల్లిస్తోంది. దీన్ని 5 శాతానికి తగ్గించాలి.
→ ఆర్టీసీకి రూ.3,000 కోట్ల అప్పులున్నాయి. ఇందులో తెలంగాణవాటా 1,200 కోట్లు. ఏటా చెల్లిస్తున్న వడ్డీ 150 కోట్లు. వన్‌టైం సెటిల్‌మెంట్ కింద దాన్ని పరిష్కరిస్తే మరో 15 ఏళ్లపాటు ఆర్టీసీకి ఇబ్బంది ఉండదు.
నేడు సీఎంకు నివేదిక: సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందజేయాల్సిందిగా మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది. వారు మంగళవారం ఉదయం కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. దీనిని కమిటీ ముఖ్యమంత్రికి అందించి, తదుపరి చర్యలపై చర్చించనుంది. ఈ సమయంలోనే ఫిట్‌మెంట్‌పై ఓ నిర్ణయాన్ని సీఎం వెల్లడించనున్నారు. దీనిని మంత్రుల కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాల ఎదుట ఉంచి చర్చించనుంది. ఆ చర్చల సారాంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళుతుంది. ఒకవేళ అప్పటికీ కార్మిక నేతలు సానుకూలంగా లేనిపక్షంలో నేరుగా ముఖ్యమంత్రే చర్చించే అవకాశముంది.
సమస్యలు పరిష్కరించాలి: ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు.
నేడు హైకోర్టు తీర్పు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మంగళవారం హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. దానిని పరిశీలించిన కోర్టు.. కార్మికులు విధుల్లో చేరాలంటూ మూడు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. తాజాగా మంగళవారం జరుగనున్న విచారణలో కార్మిక సంఘాలు హైకోర్టు ఎదుట తమ వాదనను వినిపించబోతున్నాయి. అనంతరం హైకోర్టు తుదితీర్పు వెలువరించే అవకాశముంది. సమ్మె విరమించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేస్తే.. ప్రభుత్వం కార్మికులపై ఒత్తిడి పెంచుతుంది, ఇది ఫిట్‌మెంట్ ఖరారుపైనా ప్రభావం చూపే అవకాశముంది.
ఎక్కడిబస్సులక్కడే
ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు రోజురోజుకు ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతూనే ఉంది. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీకి రాబడి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని యాజమాన్యం చెప్పడంతో అద్దె బస్సుల యజమానులు అన్ని బస్సులను తిప్పారు. కానీ వారు రద్దీ అధికంగా ఉండి, ఆదాయం ఎక్కువ ఉండే మార్గాలకే పరిమితమయ్యారు. ప్రైవేటు బస్సుల తరహాలో అడ్డగోలుగా చార్జీలు పెం చి వసూలు చేశారు. తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు కూడా ఇదే పంథాను కొనసాగించాయి. తాత్కాలిక సిబ్బంది వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి జమచేయడం లేదు. ఈ వ్యవహారాన్ని నియంత్రించాల్సిన అధికారులు కూడా సమ్మెలో ఉండడంతో డిపో మేనేజర్లు చేతులెత్తేశారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. సోమవారం జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు.
రాజధానిలో తప్పని ఇబ్బందులు..
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతోంది. సోమవారం అధికారులు 671 బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏ మూలకూ చాలలేదు. ఉద్యోగులు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. రోజూ తిరిగే 121 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మరో ఎనిమిది సర్వీసులను అదనంగా నడి పారు. మరోవైపు కార్మికులు సోమవారం కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. అన్ని డిపోల్లో ర్యాలీలు, ధర్నాలు జరిగాయి.