రైట్.. రైట్
44 శాతం ఫిట్‌మెంట్‌కు ఓకే.. సమ్మె విరమణ
నెరవేరిన కార్మికుల కల.. కదిలిన రథచక్రాలు..
హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంతో ఎనిమిది రోజులుగా కొనసాగిన సమ్మె బుధవారం ముగిసింది. 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంతోపాటు ఈ నెల 14వ తేదీ నుంచి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు... సమ్మెలో కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కార్మికుల ఆనందోత్సవాలకు అవధుల్లేకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ యూనియన్ల నాయకులు, కార్మికులు సమ్మె విరమించి సంబరాల బాటపట్టారు. రంగులు చల్లుకుని.. బాణ సంచా కాల్చి... స్వీట్లు పంచుకున్నారు.
రోజు వారి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉదయం హన్మకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట టీఎంయూ, జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ధర్నా చేసిన కార్మికులు.. అదే చోట సంబరాలు నిర్వహించుకున్నారు. హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, హరీష్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, టీఎంయూ రాష్ట్ర నాయకులు అశ్వథ్థామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతయ్య ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎంప్లాయూస్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రంగులు చల్లుకుని సంబ రాలు జరుపుకున్నారు.