ఎక్కడ అమ్మాయిలు కనబడితే అక్కడ వాలిపోయే వాళ్లం
చలాకీ చంటి అంటే తెలియని హాస్యాభిమాని ఉండరు. అతడు మాట్లాడే తీరు, నడిచే పద్దతి చూస్తేనే నవ్వు తెప్పించక మానదు. చిన్నతనం నుంచి ప్రతి వేసవిలో తాను గడిపిన క్షణాలను, మరిచిపోలేని రోజులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే.. స్కూలింగ్ చైతన్యపురిలో.. కాలేజ్ రాంకోఠి. వేసవి వచ్చిందంటే చాలు తొమ్మిది మంది బ్యాచ్‌తో సైకిల్ వేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంచక్కా తిరిగేవాళ్లం.
మధ్యాహ్నం 12 దాకా తిరిగి ఇంటికొచ్చి అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకునేవాళ్లం. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మారుతీనగర్‌లోని కొండగట్టు లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద ఉన్న గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపేవాళ్లం. శని, ఆదివారాలొస్తే మా షెడ్యూల్ పూర్తిగా మారుతుంది.
సైకిల్ వేసుకొని ఎక్కడ అమ్మాయిలు కనబడితే అక్కడ వాలిపోయేవాళ్లం. అమ్మాయిల పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అన్నీ షరామామూలే. చాలా వరకు హైదరాబాద్‌లోనే వేసవి సెలవులను గడిపేవాడిని. అప్పుడప్పుడు విజయవాడలో ఉన్న నానమ్మ వాళ్ల ఇంటికి వె ళ్లేవాడిని. అక్కడి దుర్గ గుడి, గాంధీనగర్‌లో తిరుగుతూ సరదాగా గడిపేవాడిని. చాట్ బండికి వెళ్లామంటే చాలు ఒక అరగంటపాటు బండి వాడిని ఇబ్బంది పెట్టందే వదిలేవాళ్లం కాదు.
ఐదుగురు స్నేహితులం వెళ్లి రూ. 150 నుండి రూ. 200దాకా తినేవాళ్లం. ఒక్కొక్కరం 30 పానీపూరీలు, మూడు చాట్‌లు లాగించే వాళ్లం. ఆర్‌జే, హాస్యనటుడిగా మారిన తర్వాత ఖాళీ లేకపోవడంతో ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌లు, ఓషన్ పార్కుకి వెళ్తుంటాను. ఎప్పుడైనా సమ్మర్ క్యాంప్ అని బ్యానర్ కనబడితే అలనాటి మధుర జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి.