జయతీ ఘోష్‌కమిటీ సిఫారసులివీ..
2004 సెప్టెంబర్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీ జేఎన్‌యూ అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ జయతీ ఘోష్ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ చేసిన ప్రధాన సిఫారసులు ఇవీ..
సాగుదారులను గుర్తించాలి
రాష్ట్రంలో భూసంబంధాలు అత్యంత సంక్లిష్టమైనవి. సాగుచేసే అసలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూ యాజమాన్య పత్రాలున్న రైతులతో సమానంగా రుణ సౌకర్యాలు పొందడంలో నమోదుకాని రైతులు, కౌలుదారులు, ఆదివాసీ రైతులు కష్టాలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే, కౌలుదారులు, మహిళా రైతులు సహా అసలు సిసలు సాగుదారులను గుర్తించి, అధికారికంగా పేర్లు నమోదు చేయడానికి, పాస్‌పుస్తకాలు అందించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి. సాగుకు అనువైన బంజరు భూములను పునఃపంపిణీ చేయాలి.
చదవండి : సాక్షి స్పెషల్ ఫోకస్ ( వెన్నెముకకు దన్నేది?..అన్నదాతను ఆదుకునేవారేరి? )
రుణాలు పెంచాలి..
వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం రుణభారం. పెద్ద రైతులు, చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకులు, ఇతర ప్రభుత్వ నిధులు పొందే సంస్థల నుంచి రుణసౌకర్యాలు తగ్గాయన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించి, సకాలంలో రైతుకు తక్కువ వడ్డీతో తగినంత మొత్తంలో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్న రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి ప్రభుత్వం ఇదివరకే ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్లను వినియోగించుకోవాలి. నిత్యం కరువు తాకిడికి గురయ్యే ప్రాంతాల్లోని బ్యాంకులకు నిధులు సమకూర్చడానికి రిజర్వ్‌బ్యాంక్, నాబార్డ్‌సాయంతో ప్రభుత్వం అత్యవసర నిధి ఏర్పాటు చేస్తే రైతుల రుణాలు మాఫీ చేయవచ్చు.
నీటి సమస్య పరిష్కరించాలి
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక రైతులను పీడించే సమస్య చాలీచాలని, తగ్గిపోతున్న సాగునీటి సరఫరా. దీని పరిష్కారానికి చెరువుల పునరుద్ధరణకు భారీ కార్యక్రమం చేపట్టాలి. ముఖ్యంగా అనావృష్టి ప్రాంతాల్లో జలవనరుల పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెరువులు, నదులు, వాగులు వంటి ఉపరితల జల వనరుల సమాన పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
వ్యవసాయ సేవలు పెంచాలి
మెట్టసాగు ప్రాంతాల్లో వ్యవసాయ పరిశోధన ఎంతో కీలకం. మెట్ట పంటలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వరంగ సాగు పరిశోధనను పటిష్టం చేయాలి. దాదాపు కుప్పకూలిన ప్రభుత్వ వ్యవసాయ విస్తరణ సేవ వ్యవస్థను పునరుద్ధరిస్తే, రైతు వడ్డీ వ్యాపారులుగా అవతారమెత్తిన స్థానిక విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరాదారుల కబంధ హస్తాల నుంచి బయటపడతాడు. వీటి కొనుగోలు వ్యయం పెరగడమేగాక, వాటి నాణ్యత నానాటికీ దిగజారడం కూడా పంట నష్టాలకు దారితీస్తున్నాయి. ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌ను బలోపేతం చేసి రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకోవాలి. సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టు వాడకాన్ని ప్రోత్సహిస్తే రైతుకు మేలు జరుగుతుంది. రసాయన పురుగు మందుల వల్ల జరుగుతున్న ఎనలేని నష్టాన్ని గుర్తించి సంప్రదాయ పద్ధతుల్లో చీడపీడల నివారణ చర్యలు చేపట్టాలి.
గిట్టుబాటు ధరలు అందాలి
రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ఆదాయాలు పడిపోవడానికి కారణం ప్రధాన వాణిజ్య, ఆహార పంటల ధరలు పడిపోవడం. రైతులకు గిట్టుబాటు ధరలు లభిం చడానికి, అవసరాల కోసం వచ్చిన ధరకు సరకులు తెగనమ్మకుం డా చూడడానికి సకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తగిన రీతిలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కార్యక్రమాలు అమలు చేయాలి. మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి.
ఉపాధి అవకాశాలు పెంచాలి
వ్యవసాయ సంక్షోభం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సంక్షోభం. వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతుంటే, వ్యవసాయేతర రంగాల్లో పూర్తిగా స్తంభించిపోయాయి. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలతో కనీసం 100 రోజుల పని కల్పించాలి. దీని కోసం రాష్ట్రాలు వీలైనంత త్వరగా ఉపాధి హామీ చట్టాలు చేయాలి. అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు ఈ చట్టం వర్తింపచేయాలి. గ్రామీణ వ్యవసాయేతర రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరగడానికి చర్యలు అవసరం.
పేదలకు పోషకాలు అందాలి
బలహీన వర్గాల కుటుంబాలన్నిటికీ అవసరమైన తృణధాన్యాలు కనీస మొత్తంలో అందేలా ప్రజా పంపిణీ వ్యవస్థను రూపుదిద్దాలి. అన్ని పేద కుటుంబాలకు బీపీఎల్(తెల్ల రేషన్) కార్డులు అందేలా చూడాలి. అంత్యోదయ, అన్నపూర్ణ పథకాలు దారిద్య్ర రేఖ దిగువన ఉన్నట్టు గుర్తించే బీపీఎల్ కార్డుదారులందరికీ వర్తింపచేయాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాలి.
చౌకగా విద్య, ఆరోగ్యం
ప్రభుత్వ విద్య, ఆరోగ్య సౌకర్యాల నాణ్యత పడిపోవడంతో పేద రైతులు ప్రైవేటు ఆస్పత్రులు, పాఠశాలల వైపు పరుగులు తీస్తున్నారు. సాగు వ్యయంతో పాటు ఈ ఖర్చులూ పెరిగి రుణ భారం ఎక్కువౌతోంది. ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగాల కు నిధులు పెంచి, ఈ రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటే గ్రామీణుల జీవన వ్యయం పెరగదు.