దమ్ము దమ్ములో ‘అక్రమం’! | Sales of foreign cigarettes in the city | Sakshi
Sakshi News home page

దమ్ము దమ్ములో ‘అక్రమం’!

Published Thu, Mar 30 2017 1:25 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

దమ్ము దమ్ములో ‘అక్రమం’!

దమ్ము దమ్ములో ‘అక్రమం’!

సిటీలో విచ్చలవిడిగా విదేశీ సిగరెట్ల విక్రయాలు
పన్ను ఎగ్గొడుతూ అక్రమంగా రవాణా
ఇండోనేషియాలో తయారవుతున్న బ్రాండ్లు
దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌కు...
సిటీకి చెందిన ఘరానా ముఠా వ్యవహారం
ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం


సిటీబ్యూరో: బంగారం...ఎలక్ట్రానిక్‌ వస్తువులు...మాదకద్రవ్యాలు. అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. నగరానికి చెందిన ఓ ముఠా మాత్రం కొన్నాళ్ళుగా సిగరెట్లను స్మగ్లింగ్‌ చేస్తోంది. సిగరెట్లలో ఏముందిలే...అనుకుంటున్నారా? ఈ గ్యాంగ్‌ ఏటా రూ.వందల కోట్ల విలువైన వాటిని ‘దిగుమతి’ చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతోంది. ఇటీవల చందానగర్, మియాపూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకుని, వివిధ బ్రాండ్లకు చెందిన అక్రమ సిగరెట్లు భారీగా స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు కొందరిని అరెస్టు చేసి భారీగా సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్ల అక్రమ రవాణా కారణంగా ఆర్థిక నష్టంతో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటని భావిస్తున్న అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.

ఇండోనేషియా టు సిటీ
నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో రెండు బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు డీఆర్‌ఐ గుర్తించింది. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్‌ కలిగి ఉండే డజరమ్‌ బ్లాక్, గుడాన్‌ గరమ్‌ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు గుర్తించింది. ఇవి తయారవుతున్నది ఇండోనేషియాలో అయినప్పటికీ అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తరలించకుండా...దుబాయ్‌ మీదుగా వస్తున్నట్లు గతంలో వెలుగులోకి వచ్చిన ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.

ఓసారి ఓడలు, మరోసారి విమానాలు...
సిటీకి సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్‌ఐ అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్‌ 2014లో సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చింది. పిల్లలకు వినియోగించే డైపర్లని చెప్తూ కంటైనర్‌ ముందు వరుసల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్‌ఐ అధికారులు దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకుని నిందితుల్ని అరెస్టు చేశారు. 2015 నుంచి పంథా మార్చిన అదే గ్యాంగ్‌ ఇంజనీరింగ్‌ వస్తువులు, కంప్యూటర్‌ స్పేర్‌ పార్ట్స్‌ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌కార్గోలో ఉండగా 2015 అక్టోబర్‌ 13న దాడి చేసిన డీఆర్‌ఐ రూ.51 లక్షల వలువైన 85,000 సిగరెట్లు స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసింది.

ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను...
ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులకు నష్టం కలిగించే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్‌ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్‌ వారి ద్వారా మార్కెట్‌లోని వెదజల్లుతోంది. రిటైలర్లకు కమీషన్లు ఎక్కువగా ఇస్తూ వారితో అమ్మకాలు చేపడుతోంది.

భారీగా మార్కెట్‌లోకి వెళ్ళాకే...
సిగరెట్ల స్మగ్లింగ్‌లో ఒక్కోసారి ఒక్కో పంథాను అనుసరిస్తున్న ఈ ముఠా వ్యవహారాన్ని గుర్తించడానికి డీఆర్‌ఐ, పోలీసు ఇతర అధికారులు కొంత సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారీ భారీగా సిగరెట్లు మార్కెట్‌లోకి వెళ్ళిపోయిన తరవాతే గుర్తించగలుగుతున్నారు.  

అన్ని పత్రాలు సృష్టించేస్తున్నారు...
విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులను ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో, ఎయిర్‌కార్గొ కార్యాలయాల నుంచి తీసుకోవడానికి అనేక క్లియరెన్స్‌లు అవసరం. కస్టమ్స్‌ డ్యూటీ నుంచి వివిధ రకాలైన నిరభ్యంతర పత్రాలు దాఖలు చేస్తేనే గూడ్స్‌ బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే సిగరెట్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్యాంగ్‌ కస్టమ్స్‌ తరఫున పని చేసే కస్టమ్స్‌ హోమ్‌ ఏజెంట్లు (సీహెచ్‌ఏ)లతో పాటు అనేక మందితో జట్టు కట్టింది. ఎగుమతి, దిగుమతి చేస్తున్నట్లు బోగస్‌ కంపెనీల పేర్లతో లెటర్‌ హెడ్స్‌ నుంచి కస్టమ్స్‌ క్లియరెన్స్‌ పత్రాల వరకు అన్నీ బోగస్‌వి సృష్టించేస్తున్నారు. వీటిని చూపిస్తూనే సరుకును బయటకు తీసుకువస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆరోగ్యానికీ చేటనే అనుమానం...
అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని డీఆర్‌ఐ అనుమానిస్తోంది. ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసి అధికారులు ఆయా సిగరెట్లు కాలుస్తున్న పొగరాయుళ్ళతోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయా సిగరెట్లు ఎక్కువసేపు కాలతాయని, ఎంజాయ్‌మెంట్‌ ఎక్కువని చెప్పారు. ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు.

ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్‌ హెల్త్‌ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయిని హెచ్చరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement