ఇసుక టెండర్లు రద్దు
♦ ధరావతు సొమ్ము వాపసు
♦ సీనరేజీ వసూలుకు స్వస్తి
♦ భూగర్భ గనుల శాఖ అధికారుల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అన్నివర్గాల ప్రజలకు ఇళ్లు, ఇతర నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇసుక రేవులకు నిర్వహించిన టెండర్లు అన్నీ రద్దు కానున్నాయి. టెండర్లలో పాల్గొన్నవారు చెల్లించిన ధరావతు మొత్తాన్ని సర్కారు వారికి వెనక్కు ఇవ్వనుంది. ఇప్పటివరకూ రకరకాల కారణాలవల్ల వేలం నిర్వహించని రేవులకూ ఇక టెండర్లు ఉండవు. ఈ మేరకు భూగర్భ గనులశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వేలం జరగని రేవులకు జారీచేసిన టెండర్ ప్రకటనల్ని రద్దు చేయాలంటూ జేసీల నేతృత్వంలోని జిల్లాల ఇసుక కమిటీలకు ఉత్తర్వులివ్వనున్నారు. టెండర్లు పూర్తయిన రేవులకు కూడా వాటిని రద్దుచేసి ధరావతు మొత్తాన్ని వాపసివ్వనున్నారు. నిర్మాణ పనులకు వినియోగించే ఇసుకకు సీనరేజి ఫీజు, ఇతర పన్నుల్నీ రద్దు చేయాలని గనులశాఖ నిర్ణయించింది.