
పల్లెక్రాంతి
పొద్దు పొడుస్తూనే ముంగిట గంగిరెద్దు విన్యాసాలు.. మంగళ వాయిద్యాలు. శృతి తప్పని చిడతల భజనలు... హరిదాసుల ఆశీస్సులు. పిలిచి మరీ పలుకరించే పగటి వేషగాళ్లు. పేడతో అలికిన వాకిళ్లలో... రంగురంగుల ముగ్గులు... వాటిలో అలంకరించుకున్న గొబ్బెమ్మలు.
జనారణ్యంగా మారిన మహానగరంలో అచ్చతెలుగు సంక్రాంతి శోభ కనుమరుగవుతోంది. ఆ ముచ్చట ఉన్నా తీర్చుకోలేకపోతున్న నగరవాసుల కోసం పల్లె అందాలను సిటీలో ప్రతిబింబిస్తోంది మాదాపూర్‌లోని శిల్పారామం. మెట్రో కల్చర్‌లో మనం కోల్పోయిన సంప్రదాయ సిరులతో వెలిగిపోతోంది.
సంక్రాంతి వేళ శిల్పారామంలో అడుగుపెడితే అచ్చమైన పల్లె వీధుల్లో విహరించినట్టు అనిపిస్తుంది. హరిదాసులు మొదలు బుర్రకథ చెప్పేవారి వరకూ అందరూ ఒకేచోట కనిపిస్తారు. ఈ వేడుక కోసం పదిరోజుల ముందు నుంచే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.‘సంక్రాంతి సమయంలో మూడు రోజుల పాటు కళాకారుల ప్రదర్శనలు, ప్రత్యేక స్టాల్స్‌తో కళకళలాడుతుంది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని రకాల కళకారులు తమ ప్రతిభను చాటడానికి సిద్ధంగా ఉన్నారు.
యక్షగానం, పల్లెసుద్దులు, డప్పు వాయిద్యాలు, వొగ్గుడోలు, హరికథ, బుర్రకథ, కోలాటాలు, చిడతల భజన... ఒక్కటేమిటి, పల్లెలో కనిపించే ప్రతిఒక్క కళారూపం ఇక్కడ కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లో కళావృత్తుల్లో ఉన్న ఉత్తమ కళాకారులను ఎంపిక చేసి ఇక్కడికి ఆహ్వానించాం’ అని చెప్పారు శిల్పారామం జనరల్ మేనేజర్ సాయన్న. యక్షగానమైనా, వొగ్గుడోలైనా, హరికథైనా... పల్లెలో ఆ కళను నమ్ముకుని బతికేవారికి ఇక్కడికొచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
మంచి ఆదరణ...
సంక్రాంతి సమయంలో శిల్పారామానికి గత ఐదేళ్లుగా వస్తున్న పగటివేషం కళాకారుడు పిల్లుట్ల సాయిలు... పల్లె కంటే శిల్పారామమే నయమంటాడు. ‘మాది వరంగల్ జిల్లా జనగాం. పగటివేషం మా కులవృత్తి. ఏటా పండగ సమయంలో శిల్పారామానికి వచ్చి బోలెడన్ని వేషాలేసి, సందర్శకుల్ని సంతోషపెడుతున్నందుకు నాకెంతో సంతృప్తిగా ఉంటుంది. అమ్మోరు,
పరశురాముడు, ఎల్లమ్మ, జాంబవంతుడు, పోతరాజు వంటి వేషాలతో అలరిస్తుంటాం. ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోంది’ అంటాడు సాయిలు.
పల్లెసుద్దులు...
పండగ వేళ రకరకాల పాటలు పాడుతూ పల్లెసుద్దులు చెప్పే కళాకారులు, హరినామ స్మరణతో భక్తుల కానుకులు కోరే హరిదాసులు చేసే సందడి... చూస్తుంటే ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి.
‘నెత్తిన భిక్షపాత్ర, చేతిలో చిడతలు పట్టుకుని హరినామ స్మరణ చేస్తూ శిల్పారామం వీధుల్లో తిరిగడం చక్కని జ్ఞాపకం. మా ఊళ్లో అయితే అందరూ తెలిసినవారే. కానీ శిల్పారామంలో అంతా కొత్తవారు... పైగా పట్నం వాసులు. పల్లెముఖం తెలియని చిన్నారులు మమ్మల్ని చూసి ఎంతో ఆశ్చర్యంతో ముఖాలింత చేసుకుని చూస్తూ దగ్గరికొచ్చి ఆశీస్సులు తీసుకుంటుంటారు’ అని ఆనందంగా చెప్పుకొచ్చాడు నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన హరిదాసు శంకర్.
నిజమే... వొగ్గు కథలు మొదలు బుర్రకథల వరకూ ఆ వృత్తులనే నమ్ముకున్న నిజమైన కళాకారులకు ఆతిథ్యం కల్పిస్తున్న శిల్పారామం నగరంలోని అచ్చమైన పల్లెటూరు. ఆ ఊరికెళ్లే వారంతా ఓ గంట పల్లెను దర్శించుకున్న అనుభూతితో బయటకొస్తారనడంలో సందేహం లేదు.