పటేల్ వల్లే తెలంగాణ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ స్టేట్‌ను విలీనం చేసే విశేష కృషిని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేయకపోయి ఉంటే ప్రస్తుత తెలంగాణలో పరిస్థితులు ఇప్పటి మాదిరిగా ఉండేవి కావని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని శుక్రవారం బీజేపీ లీగల్, ఐటీ, ఇంటలెక్చువల్ సెల్‌ల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సర్దార్ పటేల్-ఇంట్రికసీస్, ఇంపెరెటీవ్‌స్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్’ అనే అంశంపై రవిశంకర్‌ప్రసాద్ ప్రసంగించారు.
నేటికీ విభజనవాదం, అల్లర్లు, ఆందోళనలు కొనసాగి ఉంటే, పాకిస్తాన్‌లోనో, స్వతంత్ర రాజ్యంగానో హైదరాబాద్ ఉండి ఉంటే ప్రస్తుత తెలంగాణలో ఐటీ, ఇతర రంగాల్లో అభివృద్ది జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. కశ్మీర్ అంశాన్ని కూడా అప్పటి ప్రధాని నెహ్రూకు బదులు పటేల్‌కు అప్పగించి ఉంటే అక్కడ ప్రస్తుత అలజడి ఉండేది కాదన్నారు. పటేల్ 563 సంస్థానాలను విలీనం చేస్తే, అప్పట్లో నెహ్రూ పర్యవేక్షణలో ఉన్న కశ్మీర్ సమస్య నేటికీ పరిష్కారం కాకుండా ఉందన్నారు.
పటేల్‌ను మహాత్మాగాంధీ తొలి ప్రధానిని చేసి ఉంటే దేశ ముఖచిత్రమే మరో విధం గా ఉండేదన్నారు. ఉప ప్రధానిగా, కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన మూడేళ్ల కాలంలోనే 563 సంస్థానాలను విలీనం చేసి భారత్‌కు సమగ్ర స్వరూపం, సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పటేల్ అని కొనియాడారు. బ్రిటీష్ కాలం నాటి ఐసీఎస్ సర్వీసు స్థానంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనన్నారు.
కాంగ్రెస్‌కు పటేల్ విపక్షమా, స్వపక్షమా?
కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ స్వపక్షమా? విపక్షమా? అని రవిశంకర్‌ప్రసాద్ ప్రశ్నించారు. పటేల్‌ను కాంగ్రెస్ మరిచిపోయిందని, ఆయ న జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా బీజేపీ నిర్వహించడాన్ని జీర్ణించుకోలేక పోతోందన్నారు. దేశం కోసం ఎంతో కృషి చేసిన పటేల్ కు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల తర్వాత భారతరత్న 1991లో వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. అదీ కూడా నెహ్రూ కుటుంబానికి చెందని పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఇది వచ్చిందన్న విషయాన్ని గమనించాలని చెప్పారు.
చరిత్రను విస్మరించిన టీఆర్‌ఎస్: లక్ష్మణ్
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చరిత్రను విస్మరించి, ఖాసిం రజ్వీ వారసత్వంగా వచ్చిన ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. నాడు పటేల్ పెట్టిన భిక్షతోనే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందని, ఆ విధంగా జరగకపోతే హైదరాబాద్ ఉండేదా? తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ సీఎం అయ్యే వారా? అని ప్రశ్నించారు. భారత జాతి, సంస్కృతికి పటేల్ ఆత్మ అని మరో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జాతి నిర్మాణానికి పటేల్ పునాదిరాయిగా నిలిచారన్నారు. బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పటేల్ గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, ప్రొ.బి.సత్యనారాయణ, జీజీకే టెక్నాలజీస్ మేనేజింగ్ పార్టనర్ రఘు వీరబెల్లి, బీజేపీ లీగల్ సెల్ రవీందర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.